(వాస్తవం ప్రత్యేక ప్రతినిధి)
అనుకున్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వం మాట చెల్లించుకున్నది. బీసీలకు 42 శాతం జీవో తెచ్చింది. ఆ జీవోతో పాటే ఎన్నికల యుద్దానికి సిద్దమైంది. కోర్టులో నిలువకుండా ప్రతిపక్షాలకు ఆస్కారమివ్వకుండా అటు జీవో ఇటు ఎన్నికల షెడ్యూల్‌కు అధికార పార్టీ రంగం సిద్దం చేసుకున్నది. మాట మీద నిలబడడం, స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరుతామన్నట్టు కాంగ్రెస్ ధీమాతో ముందుకు పోతున్నది. కోర్టులో సవాల్ చేయకుండా వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని అధికార పార్టీ నిర్ణయం తీసుకున్నది. వాస్తవానికి, స్థానిక సంస్థల్లో గానీ, ఇతరత్రా ఎక్కడైనా రిజర్వేషన్ల పరిధి 50 శాతానికి మించరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
ఈ 42 శాతం జీవో అసలు కోర్టులో నిలుస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చకా చకా జీవో జారీ చేసింది. గతంలో 50 శాతం రిజర్వేషన్లు మించరాదని, 33 శాతం ఉన్న రిజర్వేషన్లను బీఆరెస్ 28కి కుదించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న 42 శాతం బీసీల రిజర్వేషన్ ప్రక్రియను కోర్టులో అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజ్యంగ విరుద్దమని, పంచాయతీరాజ్ చట్టానికి విరుద్దమని కొందరు సవాల్ విసురుతున్నారు. ఇదే జరిగి, కోర్టులో ఇది నిలవకపోతే.. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి లోకల్ బాడీ ఎన్నికలకు పోయేందుకు రెడీ అయ్యింది సర్కార్.
తాము బీసీల పట్ల చిత్తశుద్దితోనే ఉన్నామని, అందుకే ఇచ్చిన మాటకు కట్టుబడి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ సర్కార్ చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. వారి మనసు గెలుచుకునేందుకు సిద్దపడగా.. అదే సమయంలో బీజేపీ ఈ బీసీల రిజర్వేషన్ అమలు పట్ల వ్యతిరేకతతో ఉన్నదనే ప్రచారాన్నీ జనం ముందుంచనుంది. బీఆరెస్ గతంలో ఉన్న రిజర్వేషన్లను తగ్గించి బీసీల వ్యతిరేక పార్టీగా చరిత్రలో నిలిచిపోయందనే విషయాన్ని కూడా గుర్తు చేయనుంది.