హుజురాబాద్ ఉప ఎన్నిక పోరు కేసీఆర్‌కు, ఈటల రాజేందర్‌కు మధ్యే అన్నట్లుగా ఉంది. టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య పోరు రసవత్తరంగా ఉండనుంది. అందుకే మొదటి నుంచి కాంగ్రెస్ దీనిపై పెద్దగా గురి పెట్టడం లేదు. వాస్తవానికి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్‌కు దూకుడు పెరిగిన క్రమంలో తొలిసారిగా ఫేస్ చేయబోతున్న హుజురాబాద్ ఉప ఎన్నిక పై సీరియస్‌గా దృష్టి పెడ్తారని అనుకున్నారు.
రెండో స్థానం కోసం కాంగ్రెస్ పోరాటపటిమను చాటి భవిష్యత్ ఎన్నికల్లో ఓ బలమైన పార్టీగా ప్రజల్లో ఉందనే సంకేతాన్ని ఈ ఉప ఎన్నిక ద్వారా ఇవ్వాలనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో , ఆ పార్టీ అభిమానుల్లో ఉంది. కానీ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ఎంత పోరాడిన ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు చావు దెబ్బ తప్పదు. మరి అలాంటప్పుడు కష్టపడి పోరాడటం ఎందుకు? మూడో స్థానానికి దిగజారి నవ్వుల పాలవ్వడం ఎందుకని అధిష్ఠానం భావిస్తోంది.
అందుకే తమ ప్రధాన శత్రువు కేసీఆర్ కాబట్టి.. ఈ ఎన్నికలో గెలుపు కేసీఆర్ ఇజ్జత్ కా సవాల్‌గా తీసుకున్నాడు కాబట్టి అతన్ని ఓడగొట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పెట్టుకున్నది. ‘శత్రువుకు శత్రువు మిత్రుడ’న్న సమీకరణలో ఈటల రాజేందర్‌కు లోపాయికారిగా మద్దతు తెలపడం ద్వారా మరింత బలాన్ని చేకూర్చి కేసీఆర్ పై గెలిచే అవకాశాలను మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ఉంది. ఈ క్రమంలో సైద్ధాంతిక విభేదాలను కూడా పక్కన బెట్టనుంది. ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నా.. అక్కడ పార్టీ పరంగా ఎవరూ చూడడం లేదు. రాజేందర్‌ను వ్యక్తి గతంగా చూస్తున్నారు. అందుకే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ ఇన్ని శక్తులు మోహరించి, ఇంత అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న తరుణంలో ఈటల రాజేందర్ ఒంటరి పోరు చేస్తూ గెలుపు కోసం తండ్లాడుతున్నాడు. ఈ సమయంలో మరింత ఓట్ల చీలికలు తీసుకురావడం మూలంగా టీఆర్‌ఎస్‌కు మేలు జరిగే ప్రమాదం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. ఓ ‘డమ్మీ క్యాండెంట్’ను పెట్టడం వల్ల, సీరియస్‌గా ఎన్నిక పై దృష్టి పెట్టకపోవడం వల్ల పరోక్షంగా ఈటలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది.