హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యం నేతల బండారాల బట్టబయలు చేస్తున్నది. ఈటల రాజేందర్‌ను విలన్‌గా చూపించేందుకు టీఆరెస్ అపసోపాలు పడుతున్నది. ప్రజల నుంచి దూరం చేసి వ్యతిరేకత కూడగట్టే ప్రయత్నం శక్తి వంచన లేకుండా చేస్తున్నది. ట్రబుల్ షూటర్‌ను హరీశ్‌ను కేసీఆర్ రంగంలోకి దింపిన తర్వాత ఇక్కడి పరిస్థితులు మరింత వాడివేడిగా తయారయ్యాయి. హరీశ్ గతంలో మాదిరిగా హుందా రాజకీయాలకు పోకుండా కొత్త ట్రెండ్‌ను ఎంచుకున్నాడు.
అబద్ధాలు అవలీలగా ఆడుతున్నాడు. రాజేందర్‌ను ఇరుకున పెట్టేందుకు, ప్రజా మద్ధతును కూడగట్టేందుకు పడని బాధ లేదు.. చెప్పని మాట లేదు. ఈ క్రమంలో రోజు రోజు మాటల దాడులు కూడా పెరుగుతున్నాయి. హద్దులు దాటుతున్నాయి. రహస్యాలు బయటకొస్తున్నాయి. నాలుగు గోడలమధ్యే సమాధైన సత్యాలు హుజురాబాద్ గల్లీల్లో చక్కర్లు కొడుతున్నాయి.
నువ్వు సీఎం సీటుకు ఆశ పడలేదా? అని ఒక్కరంటే.. నువ్వు మామా సీఎం సీటుకు ఏసరు పెట్టేందుకు గోతులు తోడలేదా? అని మరొకరు ఒకరిపై ఒకరు మాటలతో దాడులు చేసుకుంటున్నారు. మర్మాలు బయట పెట్టేస్తున్నారు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్న చందంగా ఒకరి రహస్యాలు మరొకరు బట్టబయలు చేసుకుంటున్నారు.. బట్టలు విప్పేసుకుంటున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తొడలు చరుచుకుంటున్నారు. రా చూసుకుందామంటున్నారు.. బస్తీ మే సవాల్ అని బరిగీసి నిలుస్తున్నారు. కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఇంకా మున్ముందు ఏమేమి చూడాలో.. ఏమేమి వినాలో?
