(దండుగుల శ్రీనివాస్)
బీసీల రిజర్వేషన్ల విషయంలో బీఆరెస్, బీజేపీలు చేస్తున్న, కవ్విస్తున్న విషయాలు, అంశాలు నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టుగానే ఉన్నాయి. పైకి ప్రేమ చూపిస్తూ లోలోపల, పరోక్షంగా కత్తులు దూస్తున్న విషయం అంతా గమనిస్తున్నారు. బీసీల వ్యతిరేక పార్టీలుగా ఆ రెండు పార్టీలు ముద్రపడగా.. ఒక్క కాంగ్రెస్ మాత్రమే బీసీల కోసం తండ్లాడుతుందనే భావన, సానుభూతి, మద్దతు లభిస్తోంది. కులగణన నుంచి మొదలుపెట్టి.. ఇప్పుడు హైకోర్టులో తీర్పు వెలువడే వరకూ రేవంత్ సర్కార్ అన్ని విధాలుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతూనే ఉంది. బీఆరెస్ వీటిని అడ్డుకునేందుకు సుప్రీం గడప కూడా ఎక్కింది. ఇది అందరూ ఊహించిందే. మొన్నటి దాకా పాలించిన కేసీఆర్.. బీసీలకు ఉన్న రిజర్వేషన్లు తగ్గించి ఆ సమాజాన్ని ఘోరంగా మోసం చేసిన విషయం వారింకా మరవలేదు. ఇప్పుడు కొడుకు కేటీఆర్ రూపంలో బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా అన్ని రకాల ఎత్తులు, జిత్తులు ప్రదర్శిస్తున్న విషయాన్నీ చూశారు. చూస్తున్నారు.
బీఆరెస్, బీజేపీ పార్టీలు బీసీల విషయంలో తేలు కుట్టిన దొంగల్లా గప్‌చుప్‌గా ఉన్నారు. పైకి ఏమీ మాట్లాడటం లేదు. రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ ఎదురీదుతూ ఉంటే.. ఒడ్డున కూర్చుని ఈ రెండు పార్టీలు తమాషా చూస్తున్నాయి. వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు రేవంత్ సర్కార్‌పై బీసీ మద్దతును విపరీతంగా పెంచుతూ పోతున్నాయి. ఆ పార్టీ చిత్తశుద్దిని, సర్కార్ కమిట్‌మెంట్‌కు బీసీలు ఫిదా అవుతున్నారు. ఇప్పడి ట్రెండ్ రాజకీయ యవనికపై కొత్త వాతావరణాన్ని తీసుకొచ్చింది. మొన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పుడో లెక్కలాగే ఉంది రేవంత్ సర్కార్ బీసీల విషయంలో తీసుకుంటున్న సీరియస్ చర్యలు. బీఆరెస్, బీజేపీలు ఎప్పటికైనా అగ్రవర్ణాల అడుగులకు మడుగులొత్తే పార్టీలేనని ఇప్పుడింకా స్పష్టంగా తేలిపోయింది. బీసీల కోసం ఎవరు నిలబడుతున్నారు? ఎవరు కలబడుతున్నారు?? ఎవరు ఇచ్చిన మాట కోసం పోరాడుతున్నారు?? అనేది బాగా క్లారిటీ వచ్చేసింది జనాలకు. పాలకు పాలు.. నీళ్లకు నీళ్లు… ఇప్పుడు బీసీలు ఐక్యంగా ఉన్నారు. మెలకువతో ఉన్నారు. చైతన్యంతో జరగుతున్నది చూస్తున్నారు. జరగబోయేదాని గురించి అంచనా వేసుకుంటున్నారు.