(దండుగుల శ్రీనివాస్)
లేటుగా వచ్చినా లేటెస్టుగా గెలుస్తామనేలా కాంగ్రెస్ లోకల్‌బాడీ ఎన్నికల్లో గెలుపు కోసం వినూత్నంగా ముందుకుపోతున్నది. కొన్ని నెలల క్రితం.. అటు బీఆరెస్, దాని మిత్రపక్షంగా కొనసాగుతున్న బీజేపీలు రెండూ స్థానిక ఎన్నికలపై గంపెడాశలు పెట్టుకున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతున్నదని చంకలు గుద్దుకున్నా రెండు పార్టీలకు గట్టి ఝలకే ఇచ్చింది కొద్ది నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ సర్కార్. మొదట్లో స్టార్టింగ్ ట్రబుల్స్ ప్రభుత్వం ఇబ్బందులు పడిన విషయం వాస్తవం. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా పెద్దగా సర్కార్‌పై జనాలకు గురి కుదరని మాట కూడా వాస్తవమే. కానీ ఆ తరువాత నుంచి ప్రభుత్వాన్ని సీఎం రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో ముందుకు తీసుకుపోతున్నారు. ఆరు గ్యారెంటీల అమలే కాదు.. ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తూ వస్తున్నారు. రేషన్‌కార్డుల జారీ, సన్నబియ్యం పథకం ప్రభుత్వానికి బాగా లాభించే పథకాలుగా ఉన్నాయి. ఇవి జనాధారణ పొందాయి.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంచి స్పందనను తీసుకొచ్చింది. గతంలో కేసీఆర్ సర్కార్ డబుల్ బెడ్ రూం ఇండ్లని చెప్పి జనాలను మోసం చేశాడనే ఆగ్రహం ఇంకా పోలేదు పల్లెల్లో. పదేండ్లు గడిచినా పట్టుమని పది ఇండ్లు కూడా ఇవ్వలేదు పేదలకు కేసీఆర్. ఇదిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం చాలా స్పీడ్‌గా ముందుకుపోతున్నది. గత సర్కార్ ఎక్కడ విఫలమైందో.. ఆ వైఫల్యాలు ఎదురుకాకుండా.. వడివడిగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నది సర్కార్. ఈ సంక్షేమ పథకాలకు తోడు.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఆ పార్టీకి, ప్రభుత్వానికి కొత్త జీవాన్నిచ్చాయి. గతంలో ఏ పార్టీ కూడా బీసీల గురించి ఆలోచించలేదు. ఉన్న బీసీ రిజర్వేషన్లు కూడా ఎత్తేసిన ఘనత కేసీఆర్‌కుంది. బీజేపీ పక్కా అగ్రకుల పార్టీగా ముద్రపడింది. ఈ క్రమంలో రానున్న లోకల్‌బాడీ ఎన్నికలు కాంగ్రెస్ సర్కార్‌కు అనుకూలంగా మారనున్నాయి.
ఏడాది కిందటో లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్టుగా పూర్తిగా రాజకీయ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నది రేవంత్ సర్కార్. మొన్నటి వరకు బీఆరెస్… ప్రభుత్వ వ్యతిరేకతపై చాలా నమ్మకం పెట్టుకున్నది. అదే తమకు కలిసి వస్తుందని భావించింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఇక బీజేపీ లోకల్‌బాడీ ఎన్నికలపై పెద్దగా ఆశపెట్టుకోలేదు. కొన్ని వేలమీద లెక్కించే స్థానాల్లో గెలిచేందుకు మాత్రం తండ్లాడాలనుకుంది. బీఆరెస్‌కు లాభం చేకూరితే చాలు అనే ధోరణిలో అది ఉంది. కానీ ఇప్పుడు బీఆరెస్, బీజేపీకి లోకల్ ఫైట్‌లో పెద్దగా లాభించే చాన్స్ లేదు. కాంగ్రెస్ అనూహ్యంగా గ్రామీణ ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యింది కొద్ది రోజుల్లోనే. దీంతో లోకల్ ఫైట్‌లో వార్ వన్ సైడ్‌గా మారే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.