(దండుగుల శ్రీనివాస్)
మహానగరం. నడిబొడ్డునే మురికి కూపం. దేశాలు తలెత్తుకుని చూసే గొప్ప డెవలప్‌మెంట్ సిటీ. అందులోనే కాలుష్యకారక గరళంతో నిండిన ప్రవాహాం. దేశానికే రెండో రాజధానికి ఏ మాత్రం తగ్గని హంగులు. ఆ హంగుల కౌగిళ్లలోనే రోగాలను నింపుకుని కాలుకూట విషయాన్ని చిమ్మే మూసీ మురికి నీళ్లు. ఇది ఎవ్వరూ కాదలేని సత్యం. స్వరాష్ట్రం ఏర్పడింది. అంతకు ముందూ ఉన్నారు పాలకులు. ఇప్పడూ వచ్చారు పాలకులు. వారికి వీరికి తేడా లేదు. అంతా అవే తాను ముక్కలు. మూసీని మార్చలేరు. మూసీ.. పవిత్రమైన పేరును చేజేతులా కలుషితం చేసి దీని జోలికి పోయేందుకు జంకుతున్న నాయకులు.. ఆ నదీ పరివాహాక ప్రాంత ప్రజలను ఓ ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్పితే.. మనుషులుగా చూడటం లేదు. అందుకే ఆ నదిని అలా వదిలేశారు. ఆ జనాలను అలా మురికి కూపంలో కుక్కేశారు. ఇలా వరదలొచ్చినప్పుడు హడావుడి తప్ప.. నదిని సంస్కరించి.. శాశ్వత పరిష్కారం ఎన్నడూ ఆలోచించలేదు. ప్రక్షాళన చేసి పాపం కడుకుందామని ఎన్నడూ అనుకోలేదు. మురికి నరక కూపం నుంచి జనాలను బయటకు తరలిద్దామనే ఆలోచన అస్సలే రాలేదు.
మూసీ నదికి పునరుజ్జీవం పోద్దామనుకున్నది కాంగ్రెస్ సర్కార్. సంస్కరించి ప్రక్షాళన దిశగా అడుగులు వేసి మహానగరానికి మాయని మచ్చలా ఉన్న మూసీని పవిత్ర నదిగా తీర్చిదిద్దుదామను అనుకున్నది. ఇప్పుడెందుకీ లొల్లి..? అనుకున్నారు చాలా మంది. ఈ సమస్య తీవ్రత తెలియన జనం. అది కామనే. కానీ రాజకీయ నాయకులకు అంతా తెలుసు. అంతకంటే ఎక్కువగా రాజకీయమూ తెలుసు. అందుకే ఓ బీజేపీ, ఓ బీఆరెస్ కయ్యున లేచింది. ఏందీ..? మూసీ పరివాహక ప్రాంత ప్రజలను తరలిస్తారా? వాళ్లకక్కడ చాలా బాగుంది. వాసనా లేదు గీసనా లేదు. దోమలు లేవు.. గీమలూ లేవు.. పోపోవోయ్.. చూడు మేం ఎంచక్కా ఆ ఇండ్లలోనే పండుకుని వస్తున్నాం.. అని బస చేసి మరీ మూసీ బాధితులను రెచ్చగొట్టారు. సర్కార్‌కు కాళ్లండ్డం బెట్టారు. ఇక పదేళ్లు పాలించిన పాలకులైతే..దీనికి ఇన్ని పైసలెందుకు..? మీరు మింగేస్తందుకా? అసలు మూసీ ప్రక్షాళన ఎందుకు బై..? అని నిలదీసింది. చేయాల్సిది మేమే చేసేశాం. చాలా చోట్ల అది చేశాం.. ఇది చేశాం.. ఇంత ఖర్చు పెట్టాం.. అయినా జనాలను ఎందుకు తరలిస్తారు..? అంటూ ఆ నరకకూప బాధితులను అందులోనే మగ్గేందుకు కంకణం కట్టుకున్నాయి ఈ రెండు పార్టీలు. చేసిన పాపం చాలదంటూ ఇంకా మూటగట్టుకునేందుకు ఉత్సహం చూపాయి బీఆరెస్, బీజేపీ పార్టీలు.
ఇప్పుడు మూసీ ఉగ్రరూపం దాల్చింది. భవిష్యత్తులో ఇంకా ఎలా ఉండబోతుందో ఓ షాంపిల్ చూపి వదిలింది. దీనికే మూసీ పరివాహక ప్రాంత ప్రజలే కాదు.. నగరమే గజ్జున వణికింది. మూసీ నిద్ర చేసిన ఘనులు ఇండ్లలో వెచ్చగా పండుకున్నారు. మూసీ బాధితులు మాత్రం నిండా మునిగి.. మూసీ నీటి ప్రవాహానికి కొట్టుకుపోకుండా ప్రాణాలు కాపాడుకున్నారు. గూడు, కూడు చెదిరి దిక్కులేని పక్షులయ్యారు. ఇప్పుడు ఈ రెండు పార్టీల నేతలు ఆ వైపు వెళ్లడం లేదు. వారిని పరామర్శించడం లేదు. మీ ఇంట నిద్ర చేద్దామని అనడం లేదు. ఎక్కడివారక్కడ గప్‌చుప్. ఈ మూసీ ఆ రెండు పార్టీలకు తొడపాశం పెట్టింది. చూడుర్రి బే.. ఇంత ఘోర ముంటది నేను ఒక్కసారిగా వచ్చి పడితే.. అని ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియజేసింది. అయినా ఎవరి రాజకీయం వారిదే. ఇక్కడ చచ్చేవాడు చావాలి. మూసీ మురికిగా ఉన్నప్పుడు వాసతోటి. ఇలా ప్రవాహం కట్టలు దాటినప్పుడు రెక్కలు తెగి.. అంతే.
Dandugula Srinivas
Senior Journalist
8096677451