(దండుగుల శ్రీనివాస్)
ఇప్పుడంతా బీసీ మంత్రం నడుస్తోంది. కాంగ్రెస్ బాటలు వేస్తోంది. ఇతర పార్టీలు అనుసరించాల్సిన ఆగత్యం ఆసన్నమైంది. అనివార్యమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థిగా బీసీ యువకుడినే ఎంచుకున్నది. 41 ఏళ్ల నవీన్ యాదవ్‌ను ఫైనల్ చేసింది. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా.. ఆరోపణలు, ప్రచారాలు చేసినా.. అక్కడ కాంగ్రెస్ అధిష్టానం చేసిన సర్వేలో నవీన్ యాదవ్ తన సత్తాను చాటుకున్నాడు. ప్రజల వద్ద తనకున్న పరపతిని, అభిమానాన్ని సర్వేద్వారా తెలియజేసుకున్నాడు. తన నేపథ్య బలాన్ని గుర్తు చేసుకున్నాడు. గతంలో తను పోటీ చేసి ప్రజలకు చేరువైన వైనాన్నీ సర్వే ద్వారా అధిష్టానానికి తెలియజేసుకున్నాడు.
అందుకే అంతా ఊహించినట్టుగానే ఆయన పేరే ఫైనల్ అయ్యింది. ఎంఐఎం నుంచి పోటీ చేసి ఓడినా.. ఆ తరువాత ఇండిపెండెంట్ పోటీ చేసి తన సత్తా చాటినా.. జనం ముందు అదే అభిమానాన్ని కొనసాగిస్తూ.. ప్రజా సేవలో భాగంగా తను స్థాపించిన నవ యువ నిర్మాణ్ స్వచ్ఛంధ సంస్థ తనకు ఊతంగా నిలిచిన క్రమాన్ని అందుకుని మరింత ఉత్సాహంగా ఆయన యాక్టివ్ రాజకీయాల్లో ఆయన తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. ఇతర పార్టీల నుంచి అగ్రవర్ణాలకు చెందిన అభ్యర్థులు బరిలో ఉండగా, బీసీ యువకుడు ఇక్కడ వారిని ఎదుర్కొని గెలిచేందుకు రెడీగా ఉన్నాడు. బీసీల సత్తా చాటి కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చేందుకు కదనరంగంలోకి దూకాడు.