(దండుగుల శ్రీనివాస్)
అది కచ్చితంగా నోటి దురుసే. ఎక్కడ ఏం మాట్లాడుతన్నామో కూడా తెలియని సోయిలేనితనం. ఏమన్నా మాట్లాడొచ్చనే పొగురబోతుతనం. ఏం అవుతుందిలే అని పక్కవారిని చులకనగా చూసే దొరతనం. పేరుకు బీసీ.. కానీ ఆ నోరు దున్నపోతులా రంకెలేస్తుంది. ఇవన్నీ ఎవరి గురించో తెలుసు కదా. స్వయంగా పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సుత్తిమెత్తగా.. కాదు కాదు గట్టిగానే అర్సుకున్నాడు. వాస్తవానికి ఆ దున్నపోతు మాటలన్నది మరో మంత్రి అడ్లూరినే. ఇది వాస్తవం. అందుకే ఆయన గుర్రుగానే ఉండి.. గట్టిగానే పంచాదికి దిగాడు. ఇది పెద్దగా అయ్యేలా ఉందని సీఎం రంగంలోకి దిగితే తప్ప దారికి రాలేదు వ్యవహారం.
ఎన్నిసార్లు అడిగినా తన తప్పే లేదంటాడు పొన్నం. సారీ చెప్పేందుకు తెగ గింజుకున్నాడు. కానీ సారీ చెప్పేదాకా వదల్లేదు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్. దున్నపోతులా ఇంకోసారి మాట్లాడొద్దని కూడా మాస్ వార్నింగ్ ఇచ్చేశాడు. పొన్నం ముఖం ఎర్రబారింది. కానీ ఈ వ్యవహారం అంతా ముగిసే సరికి దోషిని చేసి వదిలింది మీడియా, ఆ పార్టీ పెద్దలు. తప్పించుకుందామని చూసినా వదల్లేదు మీడియా. నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇలా ఉంటుంది సంగతి అని మిగితా వారికి కూడా ఇదో మంచి గుణపాఠంలా మారిందనే చెప్పాలి. సీనియర్లం కదా మాకు తిరుగులేదు. మమ్మలెవడురా ఆపేది.. మేమేరా తోపు … అనే రేంజ్‌లో కాంగ్రెస్‌లో ఇలాగే చెలరేగిపోతూ ఉంటారు. ఇదే పద్దతి ఇప్పటి పరిస్థితుల్లో కొనసాగిస్తే ఇప్పుడిప్పుడే లేస్తున్న పార్టీ అగాథంలోకి జారిపోవటం ఖాయమంటున్నారు ఆ పార్టీ శ్రేయోభిలాషులు. అభిమానులు.