ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మంత్రి పదవి వరించబోతున్నది. అందరూ ఊహించినట్లుగానే ఆమె మళ్లీ జిల్లాలో కీలక పవర్ సెక్టార్‌గా మారనున్నది. ఎంపీగా రెండో సారి ఓడిపోయి కొద్ది రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న కవిత… మళ్లీ ఎమ్మెల్సీ, ఆ తర్వాత మంత్రిగా ఓ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు సమయం అసన్నమైంది. దసరా తర్వాత మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఈ ఫోర్ట్ పోలియోను కవితకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మంత్రి మల్లారెడ్డిని తప్పిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే జిల్లాలో ఇప్పటీకే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు. ప్రశాంత్ రెడ్డి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్నాడు. కీలకమైన బాధ్యతలన్నీ కేసీఆర్ ప్రశాంత్ రెడ్డికే అప్పగిస్తున్నాడు. ఆయనను మంత్రి వర్గం నుంచి తప్పించే అవకాశం లేదు. కవితకు మంత్రి పదవి ఇస్తే ఆమే కీలకమైన పవర్ సెక్టార్‌గా కొనసాగనుంది. ప్రశాంత్ రెడ్డి ఎక్కువగా హైదరాబాద్‌కు పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఆయనకు కేసీఆర్ చాలా కీలకమైన బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో వాటిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నాడు.
జిల్లాలో కవిత ఓటమి తర్వాత పార్టీ శ్రేణుల్లో నిరాశ, నిస్పృహలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్సీగా ఆమెకు అవకాశం ఇచ్చినా.. మంత్రి పదవి ఇవ్వడంలో జరిగిన జాప్యం వల్ల జిల్లాలో ఆమె క్రియాశీలకంగా పనిచేయలేక పోయింది. ఇదే సమయంలో బీజేపీ పుంజుకుంటు వస్తున్నది. ఎంపీ అర్వింద్ జిల్లా పై తన పట్టు నిలుపుకోవడానికి అహరహం కృషి చేస్తున్నాడు. మరోవైపు రేవంత్ పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ కూడా జిల్లాలో బలం పుంజుకుంటోంది.
జిల్లా ఒకప్పుడు టీఆర్‌ఎస్ కంచుకోట. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. కవిత క్రియశీలకంగా లేకపోవడమే దీనికి కారణం. మళ్లీ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా అధిష్ఠానం ఆమెకు మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఈ పరిణామం టీఆర్‌ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపనుంది. అయితే జిల్లాలో పార్టీ ఆఫీస్, నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఆమెకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాతే ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.