(వాస్తవం ప్రతినిధి – నిజామాబాద్)
బీఆరెస్‌లో ఇంచార్జిలను ఎప్పుడు మారుస్తారో తెలియదు కానీ.. నియోజకవర్గ ఇంచార్జిలను మార్చే ప్రక్రియ కాంగ్రెస్‌లో ఆర్మూర్ నుంచే మొదలుకానుంది. ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులను ఇంచార్జిలుగా నియమించింది అధిష్టానం. ఎమ్మెల్యే ఏ పార్టీ లీడర్ ఉన్నా.. అంతా అక్కడ ఓడిన వారిదే హవా. ఆర్మూర్‌లో కూడా అంతే. ఇక్కడ బీజేపీ నుంచి పైడి రాకేశ్‌రెడ్డి గెలిచినా.. తానే ఎమ్మెల్యేనని ఇంచార్జిగా ఉన్న వినయ్‌రెడ్డి ఇక్కడ చలామణి అవుతూ వస్తున్నాడు. వినయ్ మరీ మితిమిరీ అరాచకాలు చేయడం, బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగులకు పాల్పడడం.. అంతా ఇష్టారాజ్యంగా మార్చేశాడు. ఆపార్టీలోనే అతగాడికి తీవ్ర వ్యతిరేకత ఉంది.
ఆర్మూర్ నుంచి అనేక ఫిర్యాదులు ఇప్పటికే అధిష్టానానికి చేరాయి. ఈ క్రమంలో ఇంచార్జికి ఎట్లా చెక్ పెట్టాలా అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అవకాశం కోసం చూస్తున్నాడు. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికలు రావడం.. వినయ్‌తో పాటు.. ఇక్కడ సీనియర్ లీడర్‌గా ఉన్న ఏబీ శ్రీనివాస్ (చిన్నా)కు అభ్యర్థులను గెలిపించే టాస్క్‌ను పెట్టాడు మహేశ్. అయితే ఇద్దిరికీ ఇచ్చిన టాస్క్‌లో చిన్నా తన సత్తా నిరూపించుకోగా…. వినయ్ చతికిలబడ్డాడు. దీనికి తోడు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ సైతం.. ఘోరంగా ఓటమి పాలైన అభ్యర్థులను ఇంచార్జిలుగా ఉంచొద్దనే నిర్ణయం వెలిబుచ్చారు. దీంతో వినయ్‌కు చెక్ పెట్టేందుకు మార్గం సుగమమైంది.

ఇంచార్జిగా చిన్నాకు అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీలో ఉన్న అలకలు, అసంతృప్తులకు స్వస్తి పలికి, పార్టీ బలోపేతం చేయొచ్చనే అభిప్రాయంతో మహేశ్ ఉ న్నాడు. పార్టీ పటిష్టంగా చేసుకుని భవిష్యత్తులో తాను ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కూడా రూట్ క్లియర్ చేసుకోవాలనే ఆలోచన ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంచార్జిగా చిన్నాను నియమిస్తే.. తాను అనుకున్న విధంగా పార్టీ పటిష్టత జరుగుతుందనే ఆలోచనలో మహేశ్ ఉన్నాడు. చిన్నాకు ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి. దీంతో త్వరలోనే ఇక్కడ ఇంచార్జిని మార్చే ప్రక్రియకు నాంది పడనుందనే ప్రచారం జరుగుతోంది.
