(దండుగుల శ్రీనివాస్)
నిజామాబాద్‌లో ఎప్పుడూ అంతే. ఇక్కడ అర్బన్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ 60 శాతానికి పోలింగ్ పర్సెంటేజీ దాటదు. మరి ఇప్పుడు హోరాహోరీగా సాగుతున్న నిజామాబాద్ బల్దియాలో తగ్గే ఈ పోలింగ్ శాతం ఏ పార్టీ కొంప ముంచనుంది? ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. పోలింగ్ శాతం తగ్గితే వాస్తవానికి నష్టం జరిగేది అధికార పార్టీకే. కానీ ఇక్కడ మాత్రం ఇది పూర్తిగా భిన్నం. ఎందుకంటే బీజేపీ ఇక్కడ బాగా పుంజుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీని ఢీ అంటే ఢీ అనే లెవల్లో పోటీకి దిగింది. అర్వింద్ ఈసారి బీజేపీ స్వయంగా మేయర్ సీటు గెలుచుకునే మ్యాజిక్ ఫిగర్‌ను సాధించాలనే తపనతో ఉన్నాడు. తన సొంత డబ్బులను కూడా ఖర్చు చేస్తున్నాడు.
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఈ గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఇప్పుడు పోలింగ్ శాతం తగ్గితే నిజంగా నష్టం జరిగేది బీజేపీకే. ఎందుకంటే.. ఇదే ఇక్కడ కాంగ్రెస్‌కు ప్రధాన పోటీదారు. ఎక్కువ డివిజన్లలో టఫ్ పోటీనిస్తున్నది ఇదే. అందుకే ఈ పోలింగ్ శాతం తగ్గే వాతావరణం .. అధికార పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉండగా.. బీజేపీ గెలుపు ఆశలకు గండి కొట్టే చాన్స్ ఉంది. కానీ ఇక్కడ మరీ దారుణంగా పోలింగ్ శాతం పడిపోతుందా? అనేది కూడా ఓ చర్చ. ఎందుకంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైనట్టుగా 60శాతానికి లోబడే ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో కూడా అదే విధంగా వస్తుందని చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ ప్రతీ ఓటు ప్రధానమే.
అందుకే ఊర్లలో ఉన్నవారిని, వలస వెళ్లిన వారిని అందరినీ పిలిపించి మరీ ఓటేయిస్తారు. దీంతో 60శాతానికే పరిమితం కాకుండా ఇది మరో పదిహేను శాతం పెరుగుతుందనే భావనలో అధికారులున్నారు. ఇదే జరిగితే మొత్తం పోలింగ్ శాతం 70 శాతంనుంచి 75 శాతం వరకు పెరగొచ్చు. మరి ఆ పెరిగిన పది-పదిహేను శాతం ఎవరికి లాభిస్తుంది? అంటే. ఎక్కువగా బీజేపీకేనని చెప్పాలి. ఒకవేళ అసెంబ్లీలాగే.. 60శాతానికి పోలింగు శాతం ఆగిపోతే.. కచ్చితంగా ఇది కాంగ్రెస్‌కు కలిసి వస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ హోరా హోరీ పోరులో మూడో స్థానంలో ఉన్న బీఆరెస్ కొన్ని ఓట్లు చీల్చుతుంది. దీనికి తోడు స్వతంత్రులు కూడా కొన్ని ఓట్లు చీల్చుతారు. ఇవన్నీ పోను.. తగ్గిన పోలింగ్ శాతంతో బీజేపీకి గెలుపు అవకాశాలు సన్నగిల్లడం, కాంగ్రెస్‌తో నువ్వా నేనా అనే రేంజ్‌లో మరీ దగ్గరగా ఓట్ల తేడాతో గెలుపోటములు ఆధారపడే అవకాశాలే ఎక్కువ.

Dandugula Srinivas
senior journalist
7661066999
