అనుకున్నదే అయ్యింది. కేసీఆర్ తలచిందే జరిగింది. ఎప్పుడెప్పుడా అని అంతా ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నిక మరో మూడు నెలల దాకా పోయింది. ఇప్పట్లో ఆ ఎన్నికలు నిర్వహించడం లేదని ఏవోవే సాకులు చెప్పింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఇప్పటి వరకు పోటాపోటీగా జరిగిన ప్రచార పర్వానికి తెరపడింది. కాస్త జనాలకు రిలీఫ్ దొరికింది. కానీ ఉపాధి పోయింది.ఈ ఉప ఎన్నికే మూడు నెలలుగా వారికి కూడు పెడుతున్నది. నాలుగు పైసలు సంపాదించిపెడుతున్నది. ఇప్పుడు దీనికి బ్రేక్ పడింది. టీఆరెస్‌కు ఇది మరింత అనుకూలత ఏర్పరుస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎటొచ్చీ ఈటల రాజేందర్‌కు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెట్టింది. బీజేపీ ఈ ఒక్కసీటు గురించి కాకుండా, వేరే రాజకీయ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది సహజంగానే . ఇక్కడి ఎన్నికలు ఎన్నో కొత్త మలుపులకు శ్రీకారం చుట్టాయి. కొంగొత్త పథకాలు వస్తున్నాయి. పాత పథకాలు పరుగులు పెడుతున్నాయి. పాలనలోనే ఓ కొత్త వేగాన్ని ఇక్కడి ఎన్నికల వాతావరణం తీసుకొచ్చిందంటే అతిశయోక్తి కాదేమో. ఆ వేగం అలాగే ఉంటుందా? మందగిస్తుందా? ఎన్నికల వాతావరణం చల్లబడటంతో మొన్నటి వరకు పాలన హుజురాబాద్ కేంద్రంగా జరిగింది. ఇప్పుడా పరిస్థితి. నాయకులకు కొంత బ్రేక్ దొరికిందన్నమాట. ఈటలకేమో ఉన్న వాతావరణాన్ని కాపాడుకోవడం పని. టీఆరెస్‌కేమో.. అక్కడి వాతావరణాన్నంతా తన గుప్పిట్లో బంధించడమే పని.
