(దండుగుల శ్రీనివాస్)
జైలులో దాదాపు ఆరు నెలలు. పిల్లలకు దూరమైన బాధ ఆ తల్లికే తెలుసు. ఆ తల్లిపేగు పిల్లల కోసం ఎంతగా తపించిందో ఆమెకే తెలుసు. కన్నపిల్లల తరువాత ఆమె అంతగా తపించి.. మనోవేదనకు గురైనది ఆమె తల్లి గురించే. అవును ఆమెకు తల్లంటే అమితమైన ప్రేమ. ప్రాణం కన్నా మిన్నా. అందరికన్నా ఎక్కువగా ప్రేమించి.. ఆ తల్లి ప్రేమలో కరిగిపోయే ఆమెకు ఆ జైలులో భరిస్తున్న నరకం కన్నా.. ఇటు పిల్లలు.. అటు తల్లి దగ్గరగా లేరనే ఆ వేదన కదురుగా ఉండనీయలేదు. ఒంటరిగా వదిలొచ్చిన పిల్లల కోసం క్షణ క్షణం ఆ గుండె తపించింది. అడవిలో ఆకలితో ఉన్న పులికి చిక్కిన ఆవు తన దూడకు పాలిచ్చి వస్తానని చెప్పే ఆ నీతికథలో సారం మాదిరిగానే ఆమె మనసులోని ఆర్ధ్రత చాలా మందికి తెలియలేదు.
ఆమె గంభీరతనే బయటకు కనిపించింది. మొక్కవోని ధైర్యమే కళ్ల ముందు కదలాడింది. తనను నమ్ముకున్న వారిని గుప్పెడంత బాధను కూడా కలిగించొద్దనే ఆమె ఉద్దేశమే లోకం చూడగలిగింది. ఇక్కడ బిడ్డెల కోసం ఈ తల్లి తల్లడిల్లుతుంటే.. తన బిడ్డె ఎట్లా ఉందోననే బెంగతో అక్కడ ఇంట్లో ఉన్న ఆ తల్లికి నిద్రలేని రాత్రులే మిగిలాయి. కన్నీటి పర్యంతం నిత్యకృత్యమైంది ఆమెకు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి. బిడ్డెకు విముక్తి దొరికింది కేసు నుంచి. కానీ ఇద్దరూ కలుసుకోలేని పరిస్థితులు. రోజులెంత చెడ్డవి. అప్పుడు అలా దూరం చేసి ఏడిపించాయి. ఇప్పుడు దగ్గరవుదామన్నా కానీయడం లేదు. కలవనీయడం లేదు. తనివి తీరా కౌగిలించుకుని కన్నీళ్లు కార్చేందుకూ అవకాశం ఇవ్వడం లేదు. మళ్లీ అదే గోస.అదే బాధ. ఇద్దరిదీ అదే తపన. అదే మనోవేదన.
ఇప్పుడు ఆ తల్లి పేగు తల్లడిల్లుతోంది బిడ్డెను కలవలేకపోయినందుకు. కానీ బిడ్డె కాళ్ల సంకెళ్లు తెగిపడినందుకు, రెక్కలు విచ్చుకుని మరింత బలంగా ఆకాశానికేసి ఎగురుతున్నందుకు, నిలిచి గెలిచినందుకు బిడ్డె దగ్గర లేకున్నా.. కౌగిలించుకుని తనివితీరా ముద్దాడిన మధురానుభూతిని ఆ తల్లి పొందింది. పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుని…తల్లిని కలవకున్నా.. ఆమె ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయనే మనోధైర్యంతో ఈ బిడ్డె స్వాంతన పడుతోంది. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు నిరంతరం తపించె హృదయాలు. అప్పుడు ఆ తల్లిబిడ్డెలను దూరం చేసిందెవరు? ఇప్పుడు ఈ తల్లీబిడ్డెలను కలవనీయకుండా చేస్తున్నదెవరు? వాస్తవాలు సమాజానికి తెలుసు. పరిష్కారాలు కాలానికి తెలుసు.
Dandugula Srinivas
Senior Journalist
7661066999

