(దండుగుల శ్రీ‌నివాస్‌)

న‌రంలేని నాలుక ఏమైనా మాట్లాడుతుందంటారు. కేటీఆర్ నాలుక‌లో మాత్రం న‌ర‌మే కాదు.. ఆ నాలుక న‌ర‌న‌రాన అహంకారం కూడా నిండి ఉంది. అందుకే అది ఇంకా అదే అల‌వాటైన ధోర‌ణిలోనే మాట్లాడుతున్న‌ది. అవ‌కాశ‌వాద రాజ‌కీయాన్ని బాగా వంట ప‌ట్టించుకున్న రామ‌న్నను ఇప్పుడు ముద్దుగా సాకుల రాముడు అని పిలుచుకోవాల్సి వ‌స్తుంది. ఎందుకంటే.. త‌మ ఓటిమికి ప‌లు ర‌కాల వ‌ర్ణ‌ణ‌లు చేస్తున్నాడు. ప‌లు కార‌ణాలు వెతుక్కుంటున్నాడు. ప‌లు అభిప్రాయాల‌ను జొప్పిస్తున్నాడు. ఫ్ర‌ష్ట్రేష‌న్‌లో ఎటుబ‌డితే అటు.. ఏది బ‌డితే అది మాట్లాడేస్తున్నాడు.

త‌ప్పులెన్నువాడు త‌న త‌ప్పులెరుగ‌డు అన్న‌ట్టు.. త‌ప్పుల‌న్నీ వెతుక్కుతున్నాడు. అంద‌రినీ నిందిస్తున్నాడు. అంతా మీరే చేశార‌ని బ‌ట్ట‌కాల్చి మీదేస్తున్నాడు. కానీ త‌మ త‌ప్పులు మాత్రం తెలుసుకోవ‌డం లేదు. కాదు కాదు.. తెలిసినా ఒప్పుకోవ‌డం లేదు. త‌ప్పులెన్నో ఉన్నా అవి త‌మ త‌ప్పిదాలే కావ‌ని క‌ప్పిపుచ్చుకుని మంది మీద ప‌డుతున్నాడు. ఇది నిన్న‌టి వ‌ర‌కు జ‌రిగిన తంతే. ఇప్పుడు కొత్త సాకు దొరికింది రామ‌న్న‌కు. క‌విత మీద పెట్టిన ఢిల్లీ లిక్క‌ర్ కేసును కొట్టేసింది కోర్టు. దీన్నీ త‌న అవ‌కాశవాద‌, అహంకార‌, స‌మ‌ర్థింపు ధోర‌ణి రాజ‌కీయానికి వాడేసుకున్నాడు అలా అల‌వోక‌గా. క‌విత జైలుకు పోవ‌డం వ‌ల్లే తాము ఓడిపోయామ‌ని నిర్ల‌జ్జ‌గా చెప్పేశాడు.

అంతే.. అంతే .. ఓ కేసీఆర్‌.. ఓ కేటీఆర్‌… ఆ స‌ర్కార్‌.. అన్నీ అన్నీ అన్నీ మంచి పనులే చేశారు. ప్ర‌జారంజ‌క పాల‌నే అందించారు. కానీ ఇవిగో ఇలా జ‌నాలు పిచ్చోళ్లై కేసీఆర్‌ను ఓడించారు. కాంగ్రెస్ హామీలు చూసి ఆశ‌ప‌డి ఓడించారు. క‌విత జైలుకు పోయింది కాబ‌ట్టి.. ఓడించారు. అంతేగానీ, త‌మ త‌ప్పిదాలేమీ లేవు. లోపాలు, పాపాలు మ‌రేమీ లేవు. అహంకారమ‌స‌లే లేదు. ఉద్యోగాలు కుప్ప‌లు తెప్ప‌లుగా ఇచ్చేశారు. వ‌ద్దు వ‌ద్దు ఇక నోటిఫికేష‌న్లు ఆపండ‌న్నా విన‌లేదు. డబుల్ బెడ్ రూం ఇండ్ల‌లో ఉన్న పేద‌లు ఇప్ప‌టికీ కేసీఆర్‌ను యాది చేసుకుంట‌న్నారు. అబ్బ ఎన్ని ల‌క్ష‌ల ఇండ్లో.. ఎన్ని కోట్ల కుటంబాలో క‌దా.. సొంతింటి క‌ల నేర్చిన ఆ సర్కార్‌నా ఓడ‌గొట్టింది. గెలిచిన ఎమ్మెల్యేలంతా శాంతి కాముకులు, అవినీతికి ఆమ‌డ‌దూరం ఉండే అమాయ‌కులు, జ‌నం మెచ్చిన నేత‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌లు .. మ‌రి ఎందుకోడార‌బ్బా.. నో నెవ్వ‌ర్‌.. ఓడ‌గొట్టే వీలే లేదే. మ‌రెందుకు ఓడారు. అవును. క‌విత జైలుకు పోయిందుకే… కేవ‌లం కేవ‌లం క‌విత జైలుకు పోయినందుకే. అంతే క‌దా రామ‌న్నా! క‌డుపు చించుకుంటే కాళ్ల మీదే ప‌డుతుంది. నీ నోరు విప్పితే ఇలా న‌గ్నస‌త్యాలు నీకు నువ్వు మ‌ళ్లీ జ‌నానికి తెలిపిన‌వాడివ‌వుతారు. కాదంటావా!?

 

Dandugula Srinivas

Senior Journalist

7661066999

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed