(మ్యాడం మ‌ధుసూద‌న్‌- సీనియ‌ర్ పాత్రికేయులు)

పంచాయ‌తీ ఎన్నిక‌లు ముగిశాయి. ప‌ట్ట‌ణ‌, పుర పాలిక‌ల ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. రెండు ఎన్నిక‌ల్లోనూ అధికార పార్టీ కాంగ్రెస్ విజ‌య‌ప‌తాకాన్ని రెప‌రెప‌లాడించింది. 60 శాతానికి పైగా సీట్లు, ఓట్లు సాధించి త‌న ప‌ట్టును నిలుపుకున్న‌ది. త‌న ఆధిప‌త్యాన్ని చాటుకున్న‌ది. అయినా ఏదో భ‌యం.. ఇప్పుడే ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లకు వెళ్తే ఫ‌లితాలు ఎలా ఉంటాయోన‌ని ఆందోళ‌న‌. ఇక గ్రేట‌ర్ అండ్ గ్రేటెస్ట్ సిటీ ట్రై కార్పొరేష‌న్ల‌లో ఏ విధంగా ఎన్నిక‌ల‌కు ముందుకు వెళ్లాల‌నేది ఓ పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ఇప్ప‌టికింకా ప‌ట్టులేని న‌గ‌రంలో ఏ విధంగా యుద్ధాన్ని మొద‌లు పెట్టాలో తెలియ‌క త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. రైతు భ‌రోసా లేదు. యాసంగి గ‌డిచిపోయింది. భ‌రోసా రొక్కం మాత్రం రాలేదు. ఇక వానాకాలంలోనే రైతు భ‌రోసా అన్న‌ట్లు స‌ర్కార్ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది. ఈ క్ర‌మంలో మ‌రో ఆరు నెల‌ల వ‌ర‌కు ఎన్నిక‌ల జోలికి పోవ‌ద్ద‌ని స‌ర్కార్ కొత్త ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్న‌ది.

ఎండాకాలం ప‌రీక్ష‌లు, వానాకాలం వాన‌లు అయిన త‌రువాతే ఆగ‌ష్టు లేదా అక్టోబ‌ర్‌లో ఎన్నిక‌ల‌కు పోయే ఆలోచ‌న ఉన్న‌ట్టు తెలుస్తున్న‌ది. అంత‌లోపు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న పేరుతో పార్టీని ప‌టిష్టం చేసుకునే దిశ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. బ‌డ్జెట్ శాస‌న‌స‌భా స‌మావేశాల‌కు ముందే మార్చి 2వ తేదీ నుంచే ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌నకు శ్రీ‌కారం చుట్టాల‌ని ప్ర‌భుత్వం నిర్ణయించింది. ఈ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల త‌క్ష‌ణ పరిష్కారం కోసం 90 నుంచి వంద రోజులు అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు స్థానిక కాంగ్రెస్ నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌నున్నారు. ఇందిర‌మ్మ ఇండ్ల‌కు ముగ్గు పోసే కార్య‌క్ర‌మం నుంచి మొద‌లుకొని.. రోడ్లు, మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌పై దృష్టి సారించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల‌కు చేరువై మేమున్నామ‌ని భ‌రోసా ఇవ్వ‌డానికి కాంగ్రెస్ నాయ‌కులు అవ‌స‌ర‌మైన అన్ని కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని అధిష్టాన వ‌ర్గం సూచించింది.

వాస్త‌వానికి, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన‌ప్ప‌టికీ.. గ‌తంలో బీఆరెస్‌లో అధికారంలో ఉన్న‌ప్ప‌టితో పోలిస్తే ఈ ఫ‌లితాలు ఆశించినంతంగా లేవు. ఆరు గ్యారెంటీల అమ‌లులో నిధుల కొర‌త, కాంగ్రెస్ పార్టీలో కొత్త, పాత ఎమ్మెల్యేల ర‌గ‌డ‌, నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీలో జాప్యం.. అధికార పార్టీకి సంక‌టంగా మారాయి. ఈ ప‌రిస్థితిని అధిగ‌మించ‌డానికి ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న‌ను తెర మీద‌కు తెస్తున్నారు. రైతు భ‌రోసా ఇప్ప‌టికిప్పుడు ఇవ్వ‌క‌పోయినా.. ఇందిర‌మ్మ ఇళ్ల‌ను ముగ్గులు వేయ‌డం, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు నిధుల‌ను వెంట వెంట‌నే విడుద‌ల చేయ‌డం వంటి ప‌నుల‌ను చేప‌ట్ట‌నున్నారు. ఇక, గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్‌ను మూడు ముక్క‌లు చేయ‌డం ద్వారా ఎంత అనుకూల‌త ఉందో అంత వ్య‌తిరేక‌త ఉంది. బైఫ‌ర్ఫికేష‌న్ కాకుండా ట్రైఫ‌ర్ఫికేష‌న్‌.. అంటే న‌గ‌రాన్ని మూడు ముక్క‌లుగా విభ‌జించ‌డం కాంగ్రెస్ ఇప్ప‌టికిప్పుడు అంత‌గా అనుకూలించ‌డం లేదు. ఈ విభ‌జ‌న కార్పొరేష‌న్ల ప‌రిధిలో డివిజ‌న్లను అశాస్త్రీయంగా చేర్చ‌డం, ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి గుర‌వుతున్న‌ది.

దీంతో పాటు హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ అభివృద్ధిలో త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర వేసుకోలేక‌పోయింది. ఈ స్పెష‌ల్ ఆఫీస‌ర్ పాల‌న‌ను ఆరు నెల‌ల పాటు కొన‌సాగించి, మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రాజెక్టుతో పాటు ఇత‌ర ప‌నుల‌తో త‌న‌కుంటూ ప్ర‌త్యేక ముద్ర వేసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి భావిస్తున్నారు. దీంతో పాటు క్యాడ‌ర్ నిర్మించుకోవ‌డం, నాయ‌కుల‌ను ప‌టిష్టం చేయ‌డం వంటి త్రిముఖ వ్యూహంతో ముందుకు క‌ద‌ల‌నున్నారు. అంటే.. మ‌రో ఆరు నెల‌లు.. ఆగ‌స్టులో జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌వ‌చ్చ‌ని ఓ అంచ‌నా. అయితే గ‌తంలో 1996-97 కాలంలో ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న‌ను చంద్ర‌బాబు అప్ప‌ట్లో మొద‌లుపెట్టాడు. దీంతో ఆయ‌న మామ‌ను వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకున్నాడ‌న్న అప‌వాదు మీద‌ప‌డ‌కుండా బ‌ల‌మైన నాయ‌కుడిగా ఎద‌గ‌డానికి వేదిక‌గా చేసుకున్నాడు. అదే త‌ర‌హాలో రేవంత్‌రెడ్డి కూడా ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed