(దండుగుల శ్రీనివాస్)
తెలంగాణ జాగృతి ఉద్యమకారుల ఆత్మగౌవర సభ నేపథ్యంలో కవిత మళ్లీ వార్తల్లో కేంద్రబిందువయ్యారు. అంతకు ముందే ఆమె తన కొత్త పార్టీపై స్పష్టత నిచ్చారు కూడ. జూన్2న అనుకుంటున్నారట. ఈలోపు ఆమెపై సోషల్ మీడియాలో దాడి పెరిగింది. గులాబీ మూకల నుంచి. మొన్నటి దాకా కొంచెం ఓపిక పట్టినట్టున్నారు. ఇక కొత్త పార్టీ… అని ఆమె ప్రకటించిందే తరువాయి… దూకుడు కూడా పెంచారు ఇంకాస్త. అందులో భాగంగానే ఆమె ఉద్యమకారుల ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేశారు గురువారం నాడు. దీనికి విస్తృతమైన ప్రచారాన్ని కల్పించింది జాగృతి. మున్సిపల్ ఎన్నికలు ముగియగానే తెల్లారే ఆమె ఈ సభను ఏర్పాటు చేశారు. ఈలోపు ఓ వాట్సాప్ సందేశం నాకు వచ్చింది. ఆమె కొత్త పార్టీ ఉద్ధేశం.. రాజకీయ ఉనికి.. ఇవన్నీ చెబుతూ వచ్చారు. ఆ మెసేజ్ జోలికి పోను. కానీ కవిత పోతున్న దారి , ఎంచుకున్న రాజకీయ విధానం, ప్రజల్లో ఆమెకు లభిస్తున్న ఆదరణ.. వీటన్నింటిపై ఓ సారి చర్చించాలనే ఆలోచన వచ్చింది. ఆ చర్చ జనాల్లోకి కూడా తీసుకుపోవాలనే ఉద్దేశం కూడా ఉంది. అందుకే కొంచెం సూటిగా.. సుత్తి లేకుండానే ఈ చిన్న విశ్లేషణ.
మొదటగా ఓ క్లారిటీ. కవితపై సోషల్ మీడియాలో దాడి చేసే మూక అది కచ్చితంగా గులాబీ టీముదే అయి వుంటుంది. ఇందులో డౌట్ లేదు. ఎందుకంటే ఆమె తన దారి తను చూసుకోవడం, తన ఎజెండా తను ఎంచుకోవడం, కొత్త పార్టీ పెట్టాలనుకోవడం, దాని పాలసీ రూపొందించడం అవన్నీ ఆమె వ్యక్తిగతం, ఆమె స్వేచ్చ. ఇది ఉన్నపళంగా ఎవరికి నష్టం కలిగిస్తున్నది. ఎవరి బండారం బయటపడుతున్నది. ఎవరి నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి ఇంకా స్పష్టంగా.. అంటే అది బీఆరెస్‌దే. ఓ కేసీఆర్, ఓ కేటీఆర్, ఓ హరీశ్‌రావు… బీఆరెస్ పార్టీదే. ఇందులో రవ్వంత కూడా అనుమానం లేదు. మరి కవిత కొత్త పార్టీ, బీసీ నినాదం.. తెలంగాణ ఉద్యమకారులకు మద్దతు, వారి తరపున పోరాటం.. అండ.. రాజకీయంగా ఈ సెక్షన్లకు వెనక నిలబడటం.. ఇవన్నింటిపైనా చర్చ చేస్తున్నారు. తూచ్.. ఇదంతా ఉత్తదే. ఆమె మోసం చేస్తున్నది.. ఆమె కోసమే ఇవన్నీ.. ఆమె లాభం కోసమే ఇదంతా. మనల్ని వాడుకుంటున్నది… ఇగో ఇదే గులాబీ దండు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం. కాదు దుష్ప్రచారం. అవును. దుష్ప్రచారమనే అనాలి. ఎందుకు?
మళ్లీ కేసీఆర్ సీఎం అయితే… కవిత బయటకు వచ్చేదా? ఇదంతా జరిగేదా? ఆమె కొత్త పార్టీ ఆలోచన వుండేదా? అనే వాళ్లూ ఉన్నారు. కొద్ది మంది కాదు చాలా మందే ఉన్నారు. ఈ ముచ్చట పక్కన పెడదాం. ఇప్పుడు జరిగేది చూద్దాం. ప్రాక్టికల్‌గా ఆలోచిద్దాం. ఆమె బయటకు వచ్చింది. అది నాన్నతో పడకనో, అన్నతో పొసగకనో.. ఆ పార్టీ తనను పట్టించుకోకనో… తనను తక్కువ చేసి చూసినందుకో…??? ఇంకా ఇంకా ఏమైనా కారణాలు ఉండి ఉండవచ్చు. మొత్తానికి ఆమె బయటకు వచ్చారు. బీసీ నినాదం అందుకున్నారు. ఈ నినాదం అందుకుని ముందుకు పోవడం అంత ఆషామాషీయేం కాదు. బీసీలంతా ఆమెకు బ్రహ్మరథం పడతారనీ కాదు. కానీ ఈ కఠినతరమైన విధానాన్ని ఆమె ఎంచుకోవడం కూడా ఆమె సాహసోపేత చర్యగానే మనం చూడాలి. అవును. చెప్పడం వేరు. ఆచరించడం వేరు. ప్రశ్నించి నిలదీయడం వేరు. ఆమె ఇప్పుడు మూడో దాంట్లో ఉన్నారు. బీసీల రాజ్యాధికారం ప్రశ్నిస్తున్నారు. వారికి తగిన న్యాయం చేయాలని నిలదీస్తున్నారు.
రాజకీయ, సామాజిక, ఆర్థిక బలోపేతం దిశగా ఆ సెక్షన్లను చైతన్యం చేద్దామనుకుంటున్నారు. పాలకులకు ప్రశ్నించడం వారి పక్షాన ఓ గొంతుక బలంగా ఉన్నదనే సంకేతం వెళ్లిపోయింది. ఇది శుభ పరిణామమే. చేయదగ్గ కార్యక్రమాలే. ఇక ఉద్యమకారుల విషయం. నిజంగా కేసీఆర్ ఉద్యమకారులను పట్టించుకుని ఉంటే, బీఆరెస్ కార్యకర్తల మనోభావాలను, వారి ఆకాంక్షలను తెలుసుకుని ఉంటే.. ఆయనకివాళ ఈ గతి పట్టి ఉండేదే కాదు. మాదిక ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించుకుని, ఇక మాకు తిరుగేలేదనే విధంగా ముందుకు వెళ్లే క్రమంలో ఆ కారు టైర్ల కింద పడి ఎన్నో ఏళ్లుగా జీవితాలను పణంగా పెట్టిన కుటుంబాలు చితికి పోయాయి. స్వరాష్ట్రంలో ఆత్మగౌరవం కాదు కాదు.. ఆత్మక్షోభ మిగిలింది. జైలు జీవితాలు, కేసులు, అప్పులు, ఆర్థిక ఆత్మహత్యలు, సామాజిక వెనుకబాటు… ఇవే తెలంగాణ ఉద్యమంలో వారికి మిగిలిన ఆస్తులు. మరి ఈ అంశం కవిత తీసుకుని వారికి వెన్నుముకగా ఉండాలనుకోవడం, వారి పక్షాన పోరాడాలనుకోవడం తప్పేంకాదు. అందుకే చాలా మంది నుంచి చాలా మంచి స్పందనే వచ్చింది. ఇప్పుడు వస్తున్నది కూడా.
పదేళ్లూ అధికారంలో ఉండి, అన్నీ అనుభవించి..ఇప్పుడు లోపాలు, పాపాలు లెక్కించి శాపాలు పెడితే ఏం లాభం అంటున్నారు. సరే, ఆమె లెక్కించిన పాపాలు, బయటపెట్టిన లోపాలలో అబద్దాలేమైనా ఉన్నాయా? మరీ ఆ ఆరోపణలు అతిశయోక్తి అనిపిస్తున్నాయా? అన్నీ నిజాలే. ఎక్కడా అబద్దాలు అల్లినట్టు, అతికించినట్టు.. జనాల చెవిలో పువ్వులు పెట్టినట్టు లేవు. ఎందుకంటే జనం ఎంతటి చైతన్యవంతులో ఆమెకు తెలుసు. తమను అమాయకులను చేసి, అబద్దాలు ఆడి ఫూల్స్‌ను చేస్తామంటే… ఎప్పుడు వాత పెట్టాలో వారికి తెలుసు. ఆ విషయం కవితకు కూడా బాగా తెలుసు. ఆమె నిఖార్సయిన నాయకురాలిగా నిలవాలనుకుంటున్నారు. జనాల చేత మెప్పు పొందాలనుకుంటున్నారు. వారి నమ్మకాన్ని చూరగొనాలనే తపనతో ఉన్నారు. గాలి మాటలు, అబద్దాల గారడీలు చేస్తే ఆమె రాజకీయ జీవితమే అంధకారమవుతుంది. అది ఆమెకు బాగా తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో ఆమె అలాంటి తప్పుడు దారి ఎంచుకోరు. ఇక తండ్రిని తిట్టడం లేదనో.. మొదట తండ్రిని వెనుకేసుకొచ్చిందనో ఆరోపణలు చేస్తున్నారు. నిజమే. ఆమె బయటకు వచ్చిన సందర్భము, వచ్చిన తరువాత వేసే ప్రతీ అడుగు కూడా నిదానంగానే వేశారు. ఆలోచించే వేస్తున్నారు. ఆ క్రమంలో ఒకేసారి దూకుడుగా బీఆరెస్ టీమ్‌పై ఆరోపణలు గుప్పించలేరు. కేసీఆర్ అంటే జనాల్లో అభిమానం ఉంది. ఎవరు కాదన్నా. కానీ కేసీఆర్ చేసినవన్నీ సరైనవేమీ కావు. ఇక్కడ గమనించాల్సింది అది. అందుకే ఆమె కేసీఆర్ పాలనలో పాపాలను మాత్రమే లెక్కించారు. లోపాలను బయటపెట్టే క్రమంలో కేసీఆర్ పేరూ వస్తది. రావాల్సిందే. ఎందుకంటే ఆయనకు తెలియకుండా పరిపాలన జరగదు. ఆయన చుట్టూ ఉన్న దయ్యాలు యథేచ్చగా చెలామణి అవుతూ పల్లికిలిస్తున్నాయంటే.. కేసీఆర్ ఇచ్చిన ధైన్యమే కదా. అంటే ఆయనకు నచ్చితే వారెలాంటి వారైనా ఓకే. నచ్చకపోతే గేటు బయటే. ఆ విధానమే కేసీఆర్ అంటే నమ్మకం లేకుండా చేసింది చాలా మంది ఉద్యమకారులకు.
ఆమె కొత్త పార్టీ ఏర్పాటు ద్వారా ప్రజలకు మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు. ఆ పార్టీ వల్ల నష్టపోయిన, మోసపోయిన, ఆత్మగౌరవం దెబ్బతిన్నవారికి ఓ వేదిక దొరికి స్వాంతన చేకూరుతుందే తప్ప.. కవితకు మాత్రమే ఉపయోగపడి మిగిలిన వారంత ఆమె పల్లికి మోయరు. బీసీ నినాదం వల్ల అధికార పార్టీ తప్పకుండా ఆ నినాదాన్ని తప్పనట్టు, చచ్చినట్టు అమలు పరిచి, ఆచరించే ప్రయత్నం చేస్తారు. దీని వల్ల ఆమెకు కాదు.. బీసీ సమాజానికే మేలు జరుగుతుంది. ఇక నష్టం ఎవరికి జరుగుతుంది. వాస్తవంగా ఇప్పటి వరకు వారికి జరిగిందంతా నష్టమే. ఆ దెబ్బతిన్న బాధిత సంఘమే ఆమె పంచన చేరేది. ఆ నెట్టి వేయబడ్డ సమాజమే ఆమె తోడు కోరుకుని నిలబడేది. తమను పావుల వాడుకున్న రాజకీయాలపై ఏవగింపు కలిగే ఆమె పార్టీ వైపు ఆశగా చూసేది. రానీయండి ఆమెను. వస్తే మనకు పోయేదేమీ లేదు. ఇప్పటి వరకు రానిది, పోయింది రాబట్టుకోవడమే తప్ప.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
