ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ చూసినా డ్రగ్ టాపిక్ నడుస్తున్నది. ఈడీ విచారణ నేపథ్యం ఇందుకు ఆజ్యం పోసింది. ఆరేళ్ల చిన్నారి అత్యాచార, హత్య ఉదంతంలో కూడా డ్రగ్ వినియోగం అంశం చర్చకు వచ్చింది. దీన్ని కాంగ్రెస్ రాజకీయంగా వాడుకునేందుకు అధికార పార్టీని లాగింది. మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి వరుసగా ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు రాష్ట్రంలో సమస్యలేవీ లేనట్లు.. అంతా డ్రగ్‌మయమే అన్నట్టు కాంగ్రెస్ దీని పై ఓ పోరాటమే చేస్తున్నది. వైట్ ఛాలెంజ్ కింద కేటీఆర్‌ను గన్‌పార్క్ అమరవీరుల స్థూపం దగ్గరికి రావాలని డిమాండ్ చేశారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దీనికి మద్దతు ప్రకటిస్తూ కేటీఆర్ వైట్ ఛాలెంజ్‌ను స్వీకరించకపోవడాన్ని తప్పుబట్టాడు.
పనిలో పని ఎలక్షన్ ఫిటిషన్‌లో డ్రగ్ టెస్ట్ రిజల్ట్ తప్పకుండా ఉండాలని డిమాండ్ చేశాడు. అమెరికాలో చిన్న ఉద్యోగానికి కూడా డ్రగ్ టెస్ట్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుందని, ఇక్కడ రాజకీయ నాయకులకు డ్రగ్ టెస్ట్ ఎందుకు చేయకూడదని ఆయన కొత్త విషయాన్ని లేవనెత్తాడు. చూస్తుంటే ఇది కేటీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య ఫైట్ కాకుండా అన్ని రాజకీయ పార్టీలకు ఈ డ్రగ్ బురద పూసేటట్లుగా ఉన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో పాటు బీఎస్పీ నేత ఆరెస్ ప్రవీణ్ కుమార్ ఈ టెస్టులో పాల్లొనాలని ఛాలెంజ్ విసిరాడు. మన రాజకీయాలు ఇప్పుడు డ్రగ్ మైకంలో మునిగిపోయాయి. రాజకీయ అవసరాల కోసం, లబ్ధి కోసం ఒకరి పై ఒకరు డ్రగ్ బురద చల్లుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
ఇప్పుడు దేశం మొత్తం రాష్ట్రం వైపు చూస్తుంది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లు ఒకరి పై ఒకరు చేసుకునే పరస్పర ఆరోపణలు, ఛాలెంజ్‌లు రాష్ట్ర పరువును రోడ్డు పైకి తెస్తున్నాయి. దేశానికి ఆదర్శం, నంబర్ వన్ అని నిన్నటి వరకు చెప్పుకున్న మనం ఇప్పుడు నువ్వు డ్రగ్ తీసుకున్నావంటే.. నువ్వు డ్రగ్ తీసుకున్నావంటూ దిగజారిపోయి విమర్శించే స్థాయికి ఎదిగాం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డ్రగ్ టెస్ట్ రిపోర్టు కూడా పెట్టాలని ఆలోచన చేసే స్థాయికి మనం ఎదిగాం. కాబట్టి దేశం మనని చూడాల్సిందే. చూసి నేర్చుకోవాల్సిందే.