(దండుగుల శ్రీనివాస్)
ఓ ఆడబిడ్డపై రాజకీయాలు. అవీ నీచాతినీచమైనవి. రాజకీయాల కోసం, పదికాలాల అధికార యావ కోసం… బిడ్డను బలిపెట్టిన సందర్భం. ఈ చేయని నేరానికి ఆమెను భౌతికంగా జైలులో ఉంచగలిగారు కానీ.. మానసికంగా ఆమె పడిన నరకయాతన.. మనోవేధన.. తల్లడిల్లిన ఆ తల్లి గోస .. వర్ణనాతీతం. దీనికి మూలం ఎవరు..? నేరమెవరిది? శిక్షెవరికి? రాజకీయంగా ఆమెను భూస్థాపితం చేసే పన్నాగంలో ఆడిన ఆటలో ఆమెను పావును చేశారు. వైకుంఠపాళిలో పాము మింగినట్టు.. లిక్కర్ కేసు పెట్టి ఆమెను పాతాళానికి పడేశామనుకున్నారు. ఆమె కన్నీటి పర్యంతమైనా నీతి, నియ్యతి ఆమెకు కష్టకాలంలో తోడున్నది. కన్నవాళ్లు పట్టించుకోకున్నా ఆమె ధర్మాన్నే నమ్ముకుని ముందుకు నడిచింది. రక్త సంబంధీకులు కత్తికట్టినా, కరుడుగట్టిన మనసులు మళ్లీ మళ్లీ కాటు వేసేందుకు ప్రయత్నం చేసినా.. మొక్కవోని ధైర్యాన్ని వీడలేదు.
ఇప్పుడు ఇవన్నీ ఆమెను గెలిపించాయి. విజేతగా నిలిపాయి. జనం ముందు మచ్చలేని నేతగా నిలబెట్టాయి. సత్యమేవ జయతే నానుడికి ఈ కేసు ఆద్యాంతాలు అద్దం పట్టాయి. ఓ ఆడబిడ్డ నికార్సుగా నిలవెత్తు నీతితో నిలబడింది. లిక్కర్ కేసు లేదు గిక్కర్ కేసు లేదు ఇదంతా పొలిటికల్ చక్కర్ అని జనం ముందు పాలకు పాలు నీళ్లకు నీళ్లుగా తేటతేల్లమైంది.
ఆమెపై జరిగిన ఈ దాడి బహుశా దేశ రాజకీయ చరిత్రలో ఎవరిపైనా జరగలేదు. అంతలా ఆమెతో ఆడుకున్నారు. తిట్టుకున్నారు. గేలి చేశారు. ఎగతాళి చేశారు. ఆమెను జనం నుంచి దూరం చేసే పన్నాగంలో చేయని కుట్రలు లేవు. కుతంత్రాలు లేవు. అసలు ఆమె చేసిన పాపమేమిటీ? రాజకీయంగా ఆమెను సమాధి చేయాల్సిన కర్మ ఎవరికి పట్టింది. ఇప్పుడా కర్మ రిటర్న్ కాబోతున్నది. కాస్కోండని ఆమె కసిగానే ముందుకు సాగునున్నది. అంతా సిద్దమై ముందుకు సాగుతున్న క్రమంలో ఆమెకు ధర్మమూ తోడు నిలిచింది. జనం మద్దతు తోడు రాగా కాలమూ కలిసి వచ్చింది. కాలంబు రాగానే కాటేసి తీరాలె! కాలోజీ మాటల ఆంతర్యానికి సమయం సందర్భమే మిగిలుంది.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
