(దండుగుల శ్రీనివాస్)
మేడారం జాతర ఈసారి ఎప్పట్లా లేదు. విభిన్నంగా ఉంది. వైభవంగా ఉంది. సంబురాలను మరింత పెంచింది. ఆనందాన్ని ఆకాశానికంటేలా చేసింది. అమ్మల ఆశీర్వచనాలకు తోడు .. జాతర కనువిందు భక్త జన సందోహాన్ని మైమరపింప జేస్తోంది. గత పాలనలో కన్నా ఈ సర్కార్ మేడారం జాతరపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గిరిజనుల ఆరాధ్యదైవం.. పోరాటాలకు స్పూర్తి సమ్మక్క, సారమ్మల దీవెనల కోసం కుంభమేళాను తలపించే.. ఈ జాతర ఇప్పుడు తెలంగాణకే కాదు.. ప్రపంచానికి హైలెట్‌గా నిలుస్తోంది. అన్ని దారులు అమ్మల దర్శనానికే. ఎడ్లబండ్ల నుంచి మొదలుకొని.. హెలికాప్టర్ల దాకా అంతా ఇప్పుడు అటువైపే. వనదేవతల ఆశీర్వాదాలు, దీవెనల కోసం కాంక్రీట్ అరణ్యం అంతా అక్కడికి చేరింది.
పల్లె పల్లెంతా ముల్లెకట్టుకుని అక్కడ వాలింది. అమ్మలను కనని కన్నులు లేవు. దర్శించుకోని తనువు లేదు. అక్కడికి చేరని కుటుంబం లేదు.. అన్నట్టుగా అంతా అక్కడే ఉన్నారు. జాతి, మతం, కులం, దేశం, ప్రపంచం.. తేడాలేమీ లేవు. అంతా అమ్మల దర్శనానికి బయలుదేరారు. గిరిజనుల సంప్రదాయాలను పాటిస్తూ.. వారి ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి చేపట్టిన చర్యలు, అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు అన్నీ అందరినీ ఆకట్టుకున్నాయి. అబ్బురపరిచాయి. సర్కార్‌కు మంచి కితాబునిచ్చాయి. ఈసారి సర్కార్‌కు ఇక్కడికి వచ్చిన భక్త జనంనుంచి మెచ్చుకోలు లభించింది. మంత్రి సీతక్కకు మరింత పేరు తెచ్చిపెట్టింది. మేడారం జాతర మురిసింది. మేడారం జాతర మెచ్చుకున్నది. సమ్మక్క సారాలమ్మల పండుగ కనులపండగుగా, తెలంగాణ కుంభమేళాను తలపిస్తోంది. మనమూ పోదామా జాతర అనిపించేలా అందరినీ ఆకర్షిస్తున్నది.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
