(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఉన్న‌దున్న‌ట్టుగా మాట్లాడే త‌త్వం ఆయ‌న‌ది. కొన్నిసార్లు కొంద‌రికి అవి క‌టువుగా వినిపించొచ్చు. కొంద‌రిని ఇబ్బంది కూడా పెట్టొచ్చు. కానీ ఆయ‌న‌లో మ‌రో కోణం అంద‌రికీ తెలియ‌దు. ఆయ‌న‌లోని సున్నిత‌త్వం, చిన్న‌పిల్ల‌ల మ‌న‌స్త‌త్వం అంద‌రి ప‌సిగ‌ట్ట‌లేక‌పోవ‌చ్చు. పేద పిల్ల‌ల ప‌ట్ల ఆయ‌న‌కున్న మ‌మ‌కారం, వాత్స్య‌ల్యం బాగా ద‌గ్గ‌ర‌గా ఉన్న‌వారికి మాత్ర‌మే తెలిసే అంశం. అమాత్యుడైనా .. ఎంత ఎదిగినా ఆయ‌న మార‌లేదు. అదే తీరు. అదే మ‌మ‌కారం. అంద‌రితో క‌లివిడిగా ఉండ‌టం. సాయం కోరితే కాద‌న‌కుండా చేయడం. ఇదే తెలుసు ఆ చేతుల‌కు. ఎముక‌లేని చేతిలా ఆయ‌న సాయం చేస్తూనే ఉంటారు. ఒక‌చేతికి తెలియ‌కుండా మ‌రో చేతితో. కుమారుడు ప్ర‌తీక్ అంటే ఎంతో ఇష్టం. చిన్న వ‌య‌స్సులోనే త‌న‌కు దూర‌మై, జీవితంలో చేదు అనుభ‌వంగా మిగిల్చి కాన‌రాని లోకాలకు పోయినా.. ఆయ‌న త‌న కుమారుడి స్మృతుల‌ను, మ‌ధుర జ్ఞాప‌కాల‌ను పేద విద్యార్థుల్లో చూసుకుంటున్నారు.

వారికి విద్యాసాయం చేయ‌డం ద్వారా ప్ర‌తీ ఒక్క‌రిలో త‌న ప్ర‌తీక్‌ను చూసుకోగ‌లుగుతున్నారు. కుమారుడి స్మృతిలో పేద విద్యార్థుల జీవితాల్లో విద్యా కుసుమాలు పూయిస్తున్నారు. ఎంతో మందికి ఉన్న‌త విద్య కోసం సాయం చేసిన ఆ చేతులు.. ఇప్పుడు వంద‌ల మంది పేద విద్యార్థుల‌ను ఉన్నత విద్య‌నందించేందుకు త‌న చిర‌కాల కోరికైన బొట్టుగూడ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను ఎంతో ఉన్న‌తంగా,అధునాతన సౌక‌ర్యాల‌తో నిర్మించారాయ‌న‌. రూ. 8 కోట్లు పెట్టి.. కార్పొరేట్‌కు ధీటుగా.. ఇక్క‌డ చ‌దివిన విద్యార్థి భ‌విష్య‌త్‌లో అత్యున్న‌త శిఖ‌రాలు అధిరోహించి న‌ల్ల‌గొండ జిల్లా గ‌ర్వ‌ప‌డేలా చేసేలా ఆయ‌న చేప‌ట్టిన ఆ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మం ప‌ట్ల అంతా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డిని వెనోళ్ల పొగుడుతున్నారు. మంత్రివర్యా…. ఆర్యా… నీ ఆశ‌యం నెర‌వేరుస్తాం.. నీవు క‌న్న క‌ల‌లు నిజం చేస్తామ‌ని బొట్టుగూడ పిల్ల‌లు ప్ర‌తిన బూనారు.

Dandugula Srinivas

Senior Journalist

7661066999

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *