వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌:
ఇందూరు మున్సిపాలిటీ ప‌రిధిలోని 19 వ డివిజ‌న్ కాంగ్రెస్ అభ్య‌ర్థి కాట్‌ప‌ల్లి శ‌మంత న‌రేందర్‌రెడ్డి వార్త‌ల్లో కేంద్ర బిందువ‌య్యారు. ఎందుకో మీ అంద‌రికీ తెలుసు. ఆమె బ‌కాయి ప‌డ్డ ఆస్తి ప‌న్ను రూ. 8 కోట్లు ఒకేసారి బ‌ల్దియాకు చెల్లించార‌ని. ఇదిప్పుడు అంత‌టా చ‌ర్చ‌కు వస్తోంది. దీన్ని ప్ర‌తిప‌క్షాలు రాజ‌కీయ అస్త్రంగా సంధించి ల‌బ్ది పొందాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ చేసేస్తున్నారీ వార్త‌ను. కానీ దీని వెనుక వాస్త‌వాలేమిటి? ఇన్ని కోట్లు పెండింగ్‌లో ఉంచే దాకా బ‌ల్దియా ఏం చేసింది? అస‌లు అక్క‌డ ఏం జ‌రిగింద‌నేది ఎవ‌రూ ఆలోచించ‌లేదు. దీనిపై వాస్త‌వం డిజిట‌ల్ మీడియా నిజామాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ నుంచి స‌మ‌గ్ర స‌మాచారాన్ని, ఆధారాల‌ను సేక‌రించింది. అస‌లు విష‌యం నిగ్గు తేలిందేమిటంటే… అడుగ‌డుగునా అధికారుల నిర్ల‌క్ష్యం, విచిత్ర వైఖ‌రి ఈ సంఘ‌ట‌న‌లో బ‌ట్ట‌బ‌య‌లైంది. స‌మ‌యానికి, టంచ‌నుగా ఆస్తిప‌న్ను చెల్లించేవారికే మున్సిప‌ల్ అధికారులు చుక్క‌లు చూపించిన వైనం క‌నిపించింది. జిల్లా కోర్టు, హైకోర్టు ఉత్త‌ర్వుల‌ను కూడా ప‌ట్టించుకోకుండా, య‌థేచ్చ‌గా ఉత్త‌ర్వుల‌ను ఉల్లంఘించిన వైన‌మూ బ‌య‌ట‌ప‌డింది. మున్సిప‌ల్ ఎన్నిక‌లు రావ‌డం.. శ‌మంతారెడ్డి త‌న డివిజ‌న్ 19 నుంచి పోటీ చేయ‌డానికి సిద్దం కావ‌డంతో నో డ్యూ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించాల‌నే నిబంధ‌న ద‌గ్గ‌ర ఇదంతా బ‌య‌ట‌ప‌డింది. అక్క‌డ ఆమె పేరు మీద ఆస్తిప‌న్ను బ‌కాయి రూ. 8 కోట్లుగా చూప‌డంతో ఆమె హ‌తాశురాల‌య్యారు. అస‌లు జ‌రిగిన విష‌యం చెప్పినా.. అక్క‌డ ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. చివ‌ర‌కు ఎన్నిక‌ల నిబంధ‌న మేర‌కు రూ. 8 కోట్ల ఆస్తిప‌న్ను చెల్లించాల్సి వ‌చ్చింది.

అస‌లేం జ‌రిగింది..? ఇవిగో వాస్త‌వాలు.. ఆధారాలు..!

న‌గ‌రంలోని వంశీ ఇంట‌ర్నేష‌న‌ల్ హోట‌ల్, బిల్డింగు శ‌మంతారెడ్డి, 8 మంది ఇత‌ర స‌హ య‌జ‌మానుల‌కు సంబంధించిన ఆస్తిప‌న్నును 01-10-2009లో మున్సిప‌ల్ అధికారులు అసెస్‌మెంట్ చేసి రూ. 2,70,170గా నిర్దారించారు. దీన్ని య‌జమానులు స‌కాలంలో, స‌మ‌యానికి చెల్లిస్తూ వ‌స్తున్నారు. 19-05-2013 లో ఇది త‌ప్పుడు అసెస్‌మెంట్ అంటూ అధికారులు కొత్త డిమాండ్ నోటీసును( 10461000558112) తెర‌పైకి తెచ్చారు. ఏడాదికి ఆస్తిప‌న్నును ఇష్టానుసారంగా పెంచి ఏడాదికి రూ. 17,35,416లుగా నిర్దారించ‌డ‌మే కాకుండా దీన్ని 01-10-2009 నుంచి చెల్లించాల్సిందిగా డిమాండ్ నోటీస్ పంపారు. దీనిపై శమంతరెడ్డి, స‌హ య‌జ‌మానులు క‌లిసి జిల్లా సివిల్ కోర్టును ఆశ్ర‌యించారు. పాత ఆస్తిప‌న్నునే కొన‌సాగించాల‌ని, కొత్త‌ది అమ‌లు చేయ‌వ‌ద్ద‌ని సీనియ‌ర్ సివిల్ జ‌డ్జి అధికారుల‌ను ఆదేశించారు. ఆ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేశారు.

మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల తరువాత సివిల్ కోర్టు 28-11-2018లో తుది తీర్పు ఇచ్చింది. త‌న తుది తీర్పులో ప్ర‌కారం పెంచిన ఆస్తిప‌న్ను చ‌ట్ట‌బ‌ద్ధం కాద‌ని కొట్టేసింది. ఇంతే కాకుండా మున్సిపాలిటీకి రీ అసెస్ చేసుకోవడానికి అవ‌కాశం ఇచ్చింది. 2019లో మున్సిప‌ల్ అధికారులు ఈ సివిల్ కోర్టు జ‌డ్జిమెంట్ ప్ర‌కారం ప్రాప‌ర్టీని రీ అసెస్ చేశారు. దీని ప్ర‌కారం ఏడాదికి రూ. 9,12, 708గా నిర్ణ‌యించి 01-09-2019 నుంచి దీన్ని అమ‌లు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీని ప్ర‌కారం శ‌మంత‌రెడ్డి, త‌న తోటి స‌హ‌చ‌రుల‌తో క‌లిసి ఈ మొత్తాన్నిస‌కాలంలో చెల్లిస్తూ వ‌స్తున్నారు.

కానీ మున్సిప‌ల్ అధికారులు మాత్రం దీన్ని పెడ‌చెవిన పెడుతూ వ‌చ్చారు. బకాయి, పెనాల్టీల‌ను మున్సిప‌ల్ శాఖ వెబ్‌సైట్‌లో పొందుప‌రుస్తూ రావ‌డ‌మే కాకుండా, 20-03-2025న‌ రూ. 7, 43, 90,363కు డిమాండ్ నోటీసును పంపారు. దీనిపై వీరు హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై మున్సిప‌ల్ అధికారులు స్పందించి త‌మ‌ డిమాండ్ నోటీసు తప్పుగా ఇచ్చామ‌ని విత్ డ్రా చేసుకున్నారు. విత్ డ్రా చేసుకోవ‌డ‌మే కాదు.. వెబ్‌సైట్‌లో బ‌కాయిల రికార్డుల‌ను కూడా స‌వ‌రించాల‌ని శ‌మంతారెడ్డి కోర్టును కోరారు. దీనిపై మున్సిప‌ల్ అధికారులు వివ‌రాలు పొందుప‌ర్చాల‌ని కోర్టు ఆదేశించినా.. వారు స‌మ‌యానికి స్పందించ‌లేదు. దీంతో మ‌ళ్లీ హైకోర్టు స్పందించి అధికారుల‌కు దానిపై కౌంట‌ర్ రూపంలో వారం రోజుల్లో లెక్క‌లు స‌మ‌ర్పించాల‌ని (30-01-2026) ఆదేశించింది.

ఇక్కడి ఇందూరు అధికారులు కోర్టు ఉత్త‌ర్వుల ప్ర‌కారం స‌కాలంలో స్పందించ‌క‌పోవ‌డంతో ఇప్ప‌టికీ బ‌ల్దియా పోర్టల్‌లో రూ 7.43 కోట్ల బ‌కాయిలు చూపిస్తున్న‌ది. దీంతో చేసేదేంలేక‌ నో డ్యూ స‌ర్టిఫికెట్ కోసం ఆ మొత్తాన్నికోర్టు త‌దుప‌రి ఉత్త‌ర్వు ప‌రిధికి లోబ‌డి చెల్లించాల్సి వ‌చ్చింది. అయితే, స‌మ‌యానికి ప‌న్ను చెల్లించే వారికే ఇలాంటి దుస్థితి వ‌చ్చింద‌ని వారు వాపోతున్నారు. దీన్ని ప్ర‌తిప‌క్షాలు త‌మ‌ ప్ర‌చార అస్త్రంగా వాడుకునేందుకు య‌త్నిస్తున్నాయి. ఇంత‌టి ఆస్తిప‌న్ను పెండింగ్ పెట్టారు చూశారా? అని నెగిటివ్ ప్ర‌చారం చేసి.. అది త‌మ పార్టీకి ప్ర‌యోజ‌నం చేకూరేలా ప్ర‌చారం చేసుకుంటున్నారు. కానీ వాస్త‌వాలు ఇలా ఉంటే.. బాధ్య‌తాయుత ప‌ద‌విలో ఉన్న నేత‌లు కూడా జ‌నాల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా దీన్ని వాడుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం ప‌ట్ల న‌గ‌ర కాంగ్రెస్ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న‌ది. ఇది వారి విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నామ‌ని, న‌గ‌ర జ‌నం కాంగ్రెస్‌కు ప‌ట్టం గ‌ట్టేందుకు రెడీగా ఉంద‌ని, సీఎం రేవంత్‌రెడ్డి సార‌థ్యంలో అధిక నిధులు రాబ‌ట్టి న‌గ‌రాభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *