(దండుగుల శ్రీనివాస్)
దొడ్లకచ్చిన గోద పెండవెట్టక పోతదా! ఇది కేసీఆర్ తరుచు వాడే సామెత. అంతా తమ దొడ్లోని గోదల్లెక్కనే ఉండాలనుకుంటాడు కేసీఆర్. అదే ఆయన నైజం. అందుకే అధికారంలోకి రాగానే ప్రతిపక్షం లేకుండా చేశాడు. ఎవరూ ఆయనను ప్రశ్నించొద్దు. నిలదీయొద్దు. ఎదురు నిలవొద్దు. అది రాజకీయంగా ఆయనా..మీడియా పరంగానైనా. అందుకే జర్నలిస్టులంటే చిన్నచూపు కేసీఆర్‌కు. అప్పటిదాకా వారిని కౌగిలించుకున్నంత పనిచేసిన కేసీఆర్.. సీఎం కాగానే గొంగళిపురుగుకన్నా అద్వాన్నంగా చూశాడు. ప్రెస్‌మీట్లలో హేళన చేశాడు. చిన్నచూపు చూశాడు. తమకు ఎదురుతిరిగిన, ప్రశ్నించిన మీడియా సంస్థలను నిషేధించి తన నియంతృత్వ పోకడలను చాటుకున్నాడు.
ఓడిపోయి ఇప్పుడు ఫామ్‌హౌజ్‌కే పరిమితమైనాడు. ఇప్పుడు కేటీఆర్ ఏమీ వీటికి అతీతుడు కాదు. ఇంకా రెండాకులు ఎక్కువే చదువుకున్నాడు. అందుకే ఎవరి పట్ల నమ్మకం లేదు. విశ్వాసం లేదు. మీడియా అంటే మరింత చిన్నచూపు. ఓడిపోగానే కేటీఆర్ అన్న మాటలే దీనికి నిదర్శనం. మేము మెడికల్ కాలేజీలకు బదులు ఓ 32 యూట్యూబ్ చానెళ్లు పెట్టి ఉంటే బాగుండె.. అధికారంలోకి వచ్చే వాళ్లమన్నాడు. అంటే జనం పిచ్చోళ్లు. ఎవరో ఏదో చెబితే ఓట్లేసేస్తారా? వారిలో చైతన్యం లేదనేగా! మరి మీకు కొన్ని సీట్లైనా ఎందుకు వచ్చాయి? ఓటమిలో మీ లోపాలేమీ లేవా? మీ పాపాలను జనం గ్రహించలేదా? తండ్రీకొడుకులది దొరతనం.అందుకే ప్రజాస్వామ్యమంటే వారికి చిన్నచూపు. జనం అంటే మరింత చిన్నచూపు. వాళ్లను గెలిపిస్తే మంచోళ్లు. లేదంటే చెప్పుడు మాటలు వినే దగుల్బాజీలు. అమ్ముడుపోయే వేస్ట్‌గాళ్లు. హామీలకు లొంగే చిల్లరగాళ్లు. అతిగా ఆశపడే హౌళాగాళ్లు.. ఇంకా ఇంకా ఏమైనా అంటారు.
బహిరంగ వేదికల మీదే. అంతకు తెగించారు. అంతగా బలిశారు. ఇచ్చిన పదేళ్ల అధికారం మత్తు దిగలేదు. అందుకే అది పోయిన ఫ్రస్టేషన్ వెంటాడుతుండగా పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఇంకా అమలు చేస్తున్నారు. మీడియాతో పెట్టుకుంటే ఏం మొస్తుంది? మరింత నష్టమే తప్ప. ఏ పార్టీ చానెళ్లు ఆ పార్టీకున్నాయి. సరే, మీవి మీకున్నాయి. ఎవరు ఏం చెబితే ఏందీ? మీరు చెప్పాల్సింది మీ వేదికల మీద చెప్పండి. పెట్టుకున్నారు కదా 32 యూట్యూబ్ చానెళ్లు.. ఇక మీతో ఏం పని అని అనుకుంటున్నారా? ఇంతటి పలాయనవాదం ఎందుకు? ఇంకా దొరతనం ఎందుకు? ఓడిపోతే పశ్చాత్తాపపడాలె. అందరికీ దగ్గరయ్యే విధంగా మసలుకోవాలె. అంతేగానీ మరింత రెచ్చిపోయి బట్టలు చింపుకుంటే బజారులో బరిబాతల నిలబడేది మీరే. ఎన్ని యూట్యూబ్ చానెళ్లు పెట్టుకున్నా.. అంతిమంగా ప్రజలే నిర్ణేతలు. మీ నడవడిక, మార్పు, పరివర్తన .. అంతా చూస్తారు. మీరు చెప్పిందే వినాలనుకుంటే.. జనం చెప్పేది కూడా చెప్పేస్తారు. సమయం వచ్చినప్పుడు.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
