వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్:
మున్సిపల్ ఎన్నికలకు సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. దాదాపు 90 శాతం ఆపై మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలిచేలా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేసి ఉన్నారు. కాగా పోటీ బాగా పెరిగిన నేపథ్యంలో నామినేషన్లు దాదాపు అన్ని చోట్ల పదుల సంఖ్యలో వచ్చాయి. ఇందులో సీనియర్లు చాలా మంది ఉన్నారు. పార్టీనే నమ్ముకన్నవాళ్లూ ఉన్నారు. కొత్తపాత కలయికల నేపథ్యంలో పార్టీ సీనియర్లకు అన్యాయం జరుగుతున్నదనే వాదనా తెరపైకి వచ్చింది. గొడవలు కూడా జరిగాయి. అల్లర్లకూ సిద్దమయ్యారు. నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం ఎక్కడికక్కడ జిల్లా ముఖ్య నేతలకు ఆదేశాలిచ్చారు.
ఈ లొల్లిని వెంటనే సద్దుమనిగేలా చేసి.. బీ ఫారాలు రాని సీనియర్లకు తప్పకుండా పదవులు ఇస్తామని మాటివ్వాలని ఆదేశించారు. దీంతో సీఎం హామీతో జిల్లాల వారీగా నేతలు, మంత్రులు సీనియర్లను బుజ్జగించారు. సీనియార్టీని బట్టి కార్పొరేషన్ పదవులు, పార్టీ పదవులు ఇస్తామని హామీ ఇవ్వడంతో నామినేషన్లు ఉప సంహరించుకున్నారు. ఇక ప్రచార పర్వంలో కాంగ్రెస్ బిజీ బిజీ కానుంది. చాలా చోట్ల కాంగ్రెస్ బీజేపీనే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. దీంతో బీజేపీని చెక్‌పెడుతూనే.. సర్కార్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ.. నిధులు రాబట్టే విషయంలో హామీలిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. కొన్ని చోట్ల బీఆరెస్ కూడా బలమైన పోటీనే ఇస్తున్నా.. అధిష్టానం నుంచి వారికి అండదండలు, సహాయ సహకారాలు కరువయ్యాయి.దీంతో రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయే పరిస్థితులు వచ్చాయని వాపోతున్నారు.
