(దండుగుల శ్రీనివాస్)
ఓ సీనియర్ బీఆరెస్ నేత .. పొద్దున్న ఫోన్లో మాట్లాడిండు. చాలా రోజుల తరువాత ఆయన ఫోన్ కాల్. యోగక్షేమాలు అన్నీ అడిగి తెలుసుకున్న తరువాత షరా మామూలుగా రాజకీయాల గురించి టాపిక్. కేసీఆర్‌కు నాటి నుంచి .. టీఆరెస్ ఆవిర్బావం ముందు నుంచి దగ్గరగా ఉన్నవారిలో ఈ నేత ఒకరు. టాపిక్ ఎటో ఎటో తిరిగి చివరకు కేసీఆర్ దగ్గరకే వచ్చి ఆగింది. రాజకీయ జీవిత చరమాంకంలో మానసిక క్షోభ లేకుండా ప్రశాంతంగా ఉండాలనే టాపిక్‌లో భాగంగా కవిత… కేసీఆర్ ఎపిసోడ్ చర్చకు వచ్చింది. ఆయన కవితకు సపోర్టుగా నిలిచారు. ఆమె తండ్రిని ఎదురించడంలో అసలు తప్పేలేదు. కేసీఆర్ గురించి అన్నీ తెలుసుకున్నది కనుకనే బయటకు వచ్చింది. ఆమె బయటకు పోకుండా నిలువరించలేకపోవడం కేసీఆర్ వైఫల్యమే.
అందరితో మెలిగినట్టు ఆమెతో కూడా అదే అహంతో నడుచుకున్నడు. ఆమె వినలేదు. అదే కేసీఆర్.. ఆమెను పిలిచి, బుజ్జగించి ఏదైనా పదివి ఇస్తాను, ప్రయార్టీ ఇస్తాను అని బతిమాలి ఉంటే ఆమె బయటకే రాకపోయేది. కానీ అలా చేయలేదు. ఎందుకంటే కేసీఆర్‌కు మాటిచ్చి తప్పే అలవాటే ఉంది. నమ్ముకున్నోళ్లనే నట్టేట ముంచిన చరిత్రా ఉండనే ఉంది. రేపు టికెట్ కన్ఫాం.. తీసుకుపో అని చెప్పి మరీ తెల్లారి డోర్లు వేసుకుని, ఫోన్లు లేపకుండా ఎంతో మందిని మానసిక క్షోభకు గురి చేసిన సంఘటనలకు నేనే ప్రత్యక్ష సాక్షిని. ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు. నేను వింటూ ఊ ఊ అంటున్నాను. ఆయన పాత జ్ఞాపకాలను, తన అనుభవాలను అలా స్పృశించుకుంటూ పోతున్నాడు. ఆయన గొంతులో ఇది వరకంటే కొంత ఆవేశం పాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆ మాటలో వేడి కూడా రాజుకుంటున్నట్టుంది.
మండలిలో కవిత.. కేసీఆర్‌నుద్దేశించి ఏం పీకి కట్టలు కట్టారని టీఆరెస్‌ను బీఆరెస్‌గా పేరు మార్చారని ప్రశ్నించిన విషయాన్నీ ఆయన ప్రస్తావించాడు. ఇంతకన్నా అవమానం ఏం కావాలి కేసీఆర్‌కు. ఇది చాలదు ఇంకా అనుభవించాలి కేసీఆర్. కవిత ఇంకా దాడి చేయాలి. వ్యక్తిగతంగా ఈ శిక్ష చాలా తక్కువే కేసీఆర్‌కు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నాడు. ఆయన వల్లే తెలంగాణ వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నాడు. ఎన్ని బాధలు పెట్టినా భరించాడు. అంత వరకూ ఓకే.
కానీ ఎంత మంది ఉసురు తీసుకున్నాడో.. ఎంత మందిని నమ్మించి మోసం చేశాడో? ఎంత మందిని వాడుకుని నిర్దాక్షిణ్యంగా వదిలేశాడో నాకు తెలుసు. చాలా తక్కువ మందికే తెలుసు. అందుకే అంటున్న కేసీఆర్‌కు ఈ శిక్ష సరిపోదు. ఇంకా అనుభవించాలి. ఆ మాటల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆయన వాగ్ధాటి ఆవేశం, ఆవేదన, ఆక్రోషం… అన్నీ కలగలిపి వాడిగా సాగుతోంది. ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంది. అది ఓ ఒడవని ముచ్చటలా.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
