(దండుగుల శ్రీనివాస్)
చిన్నప్పుడు స్కూల్లో మా టీచర్ అంటుండె. రాన్రాను రాజు గుర్రం గాడిదైందట… నువ్వూ అట్లనే అయినవ్..! నాకర్థం కాకపోతుండె. ఆ తరువాత తెలుసుకున్న. బాగా పనిచేసేటోడు. మంచిగా పేరు తెచ్చుకున్నోడు. పర్వాలేదనిపించుకున్నోడు.. ఆ తరువాత దిగజారి పనికిరాని మాటలు, చేతలు చేసేవాడిని మీద ఈ సామెతను ఉపయోగిస్తారని. ఇప్పుడు అచ్చంగా కేటీఆర్కు ఇది నప్పుతుంది. సీఎం కొడుకు కాబట్టి ఆనాడు కేసీఆర్ రాజే. ఆ రాజు కొడుకు ఈ యువరాజు. ఈయనపైనే ఆయనకు గంపెడాశలు. కాబోయే సీఎం కూడానాయె. అదే వారి అంచనాలో. ఊహలో. ఆశలో. ఇప్పుడు ఆ రాజు గుర్రం గాడిదైంది.
ఏంది బై ఒక్కసారి పుసుక్కున అంత మాటనేశినవవ్..? ఎందుకన్ననో చెప్తా. ఇవాళ ఖమ్మంలో మీటింగైంది. హాజరైండు మన మాజీ యువరాజు, రాజుగుర్రం .. అదే గాదిదైన గుర్రం. ఏమన్నడు? కొత్తక వింత, పాతొక రోత అన్నడు. అంటే జనాలకు వీరిని చూసీ చూసీ బోరు కొట్టి.. కొత్తగా కాంగ్రెస్ను ఎన్నుకుందాం… అని ఓటేశారంట. ఇందులో వీరి తప్పులే లేవట. లోపాల మాటే ఎరుగరట. పాపాలే చేయలేదట. జనానికి కోపమే తెప్పియ్యలేదట. అన్యాయమే చేయలేదట. కానీ జనమే కొత్త కోసం అంగలార్చకుంటూ కాంగ్రెస్ను ఎన్నుకున్నారంట. ఇక ఇది చాలదంటూ మరో సుభాషితం వదిలాడు.
ఏమంటాడంటే.. అయినా వాళ్లకు కూడా తెల్వాలె కదా గుర్రమేదో? గాడిదేదో?? అన్నడు. ఇదే మాట మొన్న మాజీ రాజు.. అదే ఆయన పితామహులం గారు కూడా అన్నారనుకోండి. అంటే ఇద్దరూ ఇద్దరే అన్నమాట. అహంకారంలో. ఇంకా తగ్గించుకోలేదనడంలో. సరే, విషయానికొద్దాం. గుర్రం మీరైతే గాడిద కాంగ్రెస్సన్నట్టు.. అంతేగా గాడిదలుం గారు. అంటే మరి మరి ఆ గాడిదకు ఓటేసి గెలిపించిన ఓటర్లు కూడా గాదిలే అయి వుంటారు. అంతే కదా. గాడిదలు కాదు అడ్డ గాడిదలై ఉంటారు. ఇంకా ఇంకా కంచర గాడిదలై ఉంటారు.. అంతే కదా. మరీ ఇంతలా దిగజారాల గాడిద గారు. మీరు మొన్నటి వరకు రాజుగుర్రం కదా. ఇలా గాడిద వేశాలేస్తే ఎలా..?
జనాల మెప్పు పొందేందుకు, చేసిన తప్పులకు పటాపటా చెంపలేసుకోవాలె గానీ, ఇట్లా మీ నిర్ణయం కరెక్టు కాదు. మీరు మమ్మల్ని ఓడగొట్టి తప్పు చేశారు. ఇప్పుడు అనుభవించండి. మీకు ఇప్పుడు తెలిసిందా.. అది గాడిదని. అంటూ లోపల ఉన్న ఫ్రస్టేషనంతా ఇలా వేదికల మీద బయటపెడితే… మళ్లీ మళ్లీ ఆ ఓటర్లు గాడిదలైపోతాయి జాగ్రత్త గాడిద గారు.

Dandugula Srinivas
Senior Journalist
8096677451
