‘నువ్వెక్కడి నుంచైనా పోటీ చెయ్ అర్వింద్…! నిన్ను వెంటాడి ఓడిస్తా..’ ఈ మాటలన్నది ఎమ్మెల్సీ కవిత. ఇప్పుడు అర్వింద్ యుద్ద క్షేత్రం డిసైడ్ అయ్యింది. కోరుట్ల నియోజకవర్గం. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో తను అనుకున్న వారికే టికెట్లు ఇప్పించుకోవడంలో అర్వింద్ సక్సెసయ్యాడు. అర్బన్ నుంచి ధన్‌పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ నుంచి పైడి రాకేశ్‌రెడ్డి, బాల్కొండ నుంచి ఏలేటీ అన్నపూర్ణమ్మ, జగిత్యాల నుంచి భోగ శ్రావణి, కోరుట్ల నుంచి అర్వింద్… పేర్లు ఖరారయ్యాయి.అంతా బాగానే ఉందనుకున్న సమయంలో చివరి నిమిషంలో యెండల లక్ష్మీనారాయణ .. అర్వింద్‌కు పంటికింద రాయిలా తగిలాడు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి తన అనుచరుడు కులాచారి దినేష్‌కు టికెట్ దాదాపుగా టికెట్ ఖారరయ్యింది. కానీ యెండల రాకతో ఇది ఆగిపోయింది. బోధన్ కూడా ఇద్దరు పోటీ పడనుండటంతో అదీ ఆగిపోయింది. దాదాపుగా రూరల్ నియోజకవర్గం నుంచి యెండల లక్ష్మీనారాయణ పోటీ చేసే చాన్స్ ఉంది. ఇదే జరిగితే దినేష్ పార్టీలో ఉంటాడా..? లేదా అనేది తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే… అర్వింద్ తన టీమ్‌తో కోరుట్లలో బల ప్రదర్శన చేశాడు. టికెట్లు ఖరారయిన అందరినీ కోరుట్లకు పిలుపించుకున్నాడు. అక్కడే తన సత్తా చూపే ప్రయత్నం చేశాడు. ఇదీ తన బలగం అనే రేంజ్‌లో కవరింగ్ ఇచ్చాడు. ఇందూరు పార్లమెంటుపై తనదే పెత్తనం అనే కలరింగ్ ఇచ్చాడు.
కామారెడ్డి బరి నుంచి వెంకటరమణారెడ్డి…
సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అందరూ ఊహించినట్టుగానే కాట్‌పల్లి వెంకటరమణారెడ్డిని పార్టీ డిసైడ్ చేసింది. ఇక్కడ విజయశాంతి, బండి సంజయ్ వచ్చి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ చివరకు వెంకట రమణారెడ్డినే బరిలోకి దింపింది అధిష్టానం. జుక్కల్ నుంచి అరుణతారకు అవకాశం ఇచ్చారు. బాన్సువాడ, ఎల్లారెడ్డిని పెండింగ్‌లో పెట్టారు.