తనికెళ్ల భరణి ఆవేదనకు కారణమిదే….
ప్రముఖ నటుడు, కవి, రచయిత, భాషాభిమాని తనికెళ్ల భరణి తెలుగువాడిగా పుట్టొద్దనుకున్నాడు. ఎందుకు? అంత వైరాగ్యమేమొచ్చింది? అంత ఆవేదన ఎందుకు? ఇటీవల ఆయన ఏదో సందర్భంలో అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవున్నాయి. దీన్ని చాలా మంది భాషాభిమానులు ఏకీభవిస్తున్నారు. భరణి భారంగా అన్న మాటల వెనుక మర్మాన్ని అర్థం చేసుకుంటున్నారు. అవును..! నిజమే కదా..!! ఆయన అన్న మాటల్లో అర్థం, పరమార్థం ఉంది సుమా..! అనుకుంటున్నారట.
ఇంతకీ ఆయనేమన్నాడంటే…
అనవసరంగా అక్షరాలు వాడటం దేశద్రోహం కంటే నేరమని చలంగారన్నారు. ఆ మాట నాపై ప్రభావం చూపించిందేమో. మహాభారాతాన్ని కూడా మాటలు లేకుండా తీయగలను అనే నమ్మకం నాది. వచ్చే జన్మలోనూ కవిగానే పుట్టాలనే ఆశనాది. కానీ తెలుగుదేశంలో మాత్రం పుట్టకూడదు. ఎందుకంటే సాహిత్యం పట్ల ఇంత అనాదరణ, అరుచి, నిర్లక్ష్యం ఎక్కడా లేదు. హరికథా పితామహుడు నారాయణదాసు పుట్టినింట్లో ఆయన మునిమనుమడు కాఫీపొడి దుకాణం పెట్టాడు. అది ఏ రాజకీయ నాయకుడికీ పట్టదు. గురజాడ బంగారు కళ్లద్దాలు, ఆయన జాతకం భద్రపరిచే నాథుడు లేడు. సుబ్రమణ్య భారతి అనగానే తమిళ తంబీలు లేచి నిలబడతారు. ఇక్కడ శ్రీశ్రీ అంటే అల్లూరి సీతారామారాజులో పాటలు రాశాడు… ఆయనేనా? అని అడుగుతారు. మనకు అంతే తెలుసు. కవులు బతిఆకుండగానే చస్తారు. చచ్చాక బతుకుతారు. బమ్మెర పోతన, దాశరథి రంగాచార్య… వీళ్లను మించినోళ్లున్నారా? కానీ వాళ్లెవరో మనకు తెలియదు. త్యాగరాజు పరాయి రాష్ట్రం వెళ్లి సమాధి అయ్యారు. ఇక్కడుంటే త్యాగరాజుకే కాదు, ఆయన సంగీతానికే సమాధి కట్టేవారు. తమిళనాడులో జరిగినట్టు త్యాగరాజు ఉత్సవాలు ఇక్కడ జరగవు. అసలు ఆయనెవరో ఇక్కడెవరికీ తెలియదు. వేరే భాషాల్లో వేరే సంస్క్రుతులంటే మనకు చాలా ఇష్టం. ప్యాంటు, షర్టులు వేసుకొని తిరుగుతాం. చిదంబరం చూడండి పార్లమెంటుకు కూడా పంచెకట్టుకునే వెళ్తాడు. తెలుగుకు ఆ శక్తి ఉంది. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హైదరాబాద్ వచ్చినప్పుడు నగరంలో ఉన్న తెలుగు రచయితల్ని పిలిపించి ఓ చిన్న సమావేవం ఏర్పాటు చేశారు. అందులో నుంచి ఓ రచయిత.. తెలుగు భాష నాశనం అయిపోతుందని భయంగా ఉంది సార్ అని ఆవేదన వ్యకత్ం చేశారట. తెలుగు భాషకు ఏమీ కాదు. ఎందుకంటే తనను తాను బతికించుకోగల శక్తి తెలుగుకు ఉంది.. అని అన్నారట పీవీ. అవును. తెలుగు చావదు. దాన్నెవరూ చంపలేరు. తెలుగులో ఇంత మాధుర్యం ఉంది అంటూ ఉద్యమ స్థాయిలో ప్రచారం చెయ్యాలి.
